విద్యార్థులే ఊపిరిగా.. | Sakshi
Sakshi News home page

విద్యార్థులే ఊపిరిగా..

Published Wed, Sep 6 2023 2:37 AM

Malathi Teacher: How this chemistry teacher made government school students set a world record - Sakshi

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్‌ గుడ్‌ టీచర్‌ అవార్డు గ్రహీత మాలతీ టీచర్‌. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్‌ ఒకరు.

తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్‌ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్‌ పెరుమతూర్‌ గవర్నమెంట్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది.

ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్‌ రావడంతో వీరకేరళంబుదూర్‌ గవర్నమెంట్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్‌ సైన్స్‌ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది.

ఆటపాటలతో... పాఠాలు
 విద్యార్థులు సైన్స్‌సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్‌ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్‌ ఫోన్స్‌ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. 

నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్‌ సాయంతో సైబుల్‌ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది.

మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్‌ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్‌ వరల్డ్‌  రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. 

అవార్డులు రికార్డులు...
విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్‌లైన్‌ తరగతులు చెప్పి చోళన్‌ వరల్డ్‌ రికార్డు బుక్‌ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్‌ రాధాకృష్ణన్‌ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించి వరల్డ్‌ రికార్డు 
సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్‌ కిట్స్‌ కొని ఇచ్చింది.

గేమ్‌లకు బానిసలు కాకుండా...
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్‌ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్‌గేమ్‌ వాయిస్‌ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్‌ టేబుల్‌ ఉంటుంది. ఈ టేబుల్‌లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్‌.      

‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్‌ ఉండదు. అధికారికంగా రిటైర్‌ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్‌ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్‌ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్‌ గుడ్‌ టీచర్‌ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్‌ చెబుతోంది. 

Advertisement
Advertisement