ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ చైర్మన్ సూర్యనారాయణ వ్యాఖ్యలపై మండిపడిన ఏపీజీఈఎఫ్ చైర్మన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి ఖండించారు. ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం, నియంతపాలన అనడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఈ మేరకు వెంకటరామిరెడ్డి గురువారం చేసిన ప్రకటనలో వెంకటరామిరెడ్డి ఇంకా ఏమని పేర్కొన్నారంటే.. 2014–19 మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డీఏ కేసులు పెట్టడం నిజం కాదా? అందులో మూడు, నాలుగు కులాలకు చెందినవారే 70 శాతానికిపైగా ఉండటం వాస్తవం కాదా? కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి వాటిమీద కమిటీని వేయించింది గుర్తులేదా? ఈ ఐదేళ్లలో డీఏ కేసులతో ఎవరినైనా వేధించారా? గతంలో ఒక మహిళా ఉద్యోగిని పట్టపగలు జుట్టుపట్టుకుని ఈడ్చికొడితే కనీసం కేసు పెట్టారా?
కరోనా సమయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడిలో ఉద్యోగులను పరుషంగా మాట్లాడితే ఆయన తరఫున ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా? అసలు గతంలో ఏనాడైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా? ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా? కళ్లముందు ఇన్ని వాస్తవాలు కనపడుతుంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో ఉద్యోగులు గమనించాలి. సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment