విశ్లేషణ
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికిపాటుకు గురి చేయాలి? వలసలు, సాంకర్యాల క్రమంలో మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని నిలుపుకొన్నారు, కొన్నింటిని కోల్పోయారు. ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు ఉత్తరాదివారితో తేడాగా ఉండటం సహజం. ఆ చర్మపు రంగును గురించి, ‘వీరంతా ద్రవిడులు’ అనే ఈసడింపులు తెలిసిన విషయమే. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు.
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటా రంటూ శామ్ పిట్రోడా (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌గా రాజీనామా చేశారు) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం సాగుతున్నది. రాజకీయాలను పక్కన ఉంచి మానవ వికాస శాస్త్రాన్ని, మానవ వలసల కోణాలను పరిశీలిస్తే ఆ వ్యాఖ్యలలో తప్పే మిటో అర్థం కాదు. వానరాల నుంచి ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు భూగోళంలోని వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈ సూత్రీకరణను ప్రపంచమంతా కూడా ఆమోదిస్తున్నది. మనకు మాత్రం సైన్సు కన్నా రాజకీయాలు ముఖ్యం గనుక పిట్రోడా మాటలపై భూమ్యాకాశాలను ఏకం చేసే హంగామాను సృష్టిస్తున్నాము.
ఇంతకూ పిట్రోడా అన్నదేమిటి? ఆయన దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారని మాత్రమే అనలేదు. దేశంలోని తూర్పు ప్రాంతాల వారు చైనీయులవలె, పశ్చిమ ప్రాంతాల వారు అరబ్బుల వలె, ఉత్తరాది వారు శ్వేతజాతీయులవలె ఉంటారని కూడా అన్నారు. ఈ పోలికలలో తక్కిన మూడింటిని వదలి, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల వలె ఉంటారన్న మాట ఒక్కటే వివాదమైంది. వివాదమైంది అనటంకన్న వివాదంగా మార్చారనటం సరైనదవుతుంది.
ఈ చర్చ లోకి వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. స్వయంగా బీజేపీకి చెందిన తరుణ్ విజయ్ అనే నాయకుడు, తను రాజ్యసభ సభ్యునిగా, ‘పాంచజన్య’ పత్రిక సంపాదకునిగా ఉండినపుడు, ‘‘మనం (అనగా ఉత్తరాది వారం) దక్షిణాది వారితో కలిసి ఉండటం లేదా?’’ అని వ్యాఖ్యానించారు. అనగా, తాము తెల్లగా ఉంటామని, ఉత్తమ స్థాయి వారమని, దక్షిణాది వారు నల్లగా ఉంటారని, అధమ స్థాయి వారని, అయినప్పటికీ తమది ఉదార స్వభావం గనుక అటువంటి వారితో కలిసి జీవిస్తున్నామని అర్థం.
వాస్తవానికి దక్షిణాది వారి చర్మపు రంగును గురించి, కను ముక్కుల తీరు గురించి, భాషా సంస్కృతుల గురించి, ‘వీరంతా ద్రవి డులు’ అనే పద్ధతిలో ఈసడింపులు చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ రాక వరకు అందరూ కట్టగట్టి ‘మద్రాసీ’లే. ఈ ధోరణికి బీజేపీ, సంఘ్ పరివార్ సైతం మినహాయింపు కాదన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ప్రస్తుత వివాద సందర్భంలోనూ ఈ సంగతి గుర్తించాలి. పిట్రోడా కాంగ్రెస్ నేత అయినందున, ఆయన మాటలను వివాదం చేస్తే తమకు రాజకీయంగా లాభిస్తుందనే సంకుచిత ఆలోచన తప్ప, ఇందులో బీజేపీ వివేకం ఏమీ కన్పించదు.
మనకు తెలిసి మానవ వికాస శాస్త్రం, ప్రపంచవ్యాప్తంగా వలసల చరిత్ర, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన డీఎన్‌ఏ పరిశోధనలు చెప్తున్న విషయాలు కొన్నున్నాయి. ఇండియా, చైనా, ఉత్తర యూరప్‌లలో ప్రాథమిక స్థాయి మానవ జాతులు స్వల్ప స్థాయిలో రూపుదిద్దుకున్న ప్పటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత జరిగింది ఆఫ్రికాలోని తూర్పు భాగాన గల రిఫ్ట్ వ్యాలీలో. వేలాది సంవత్సరాల కాలంలో అటువంటి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో శాస్త్రీయమైన పురావస్తు అధ్యయనాలు చెప్పాయి.
వాటిపై కెన్యా రాజధాని నైరోబీ, ఇథియో పియా రాజధాని అడ్డిస్ అబాబాలలోని జాతీయ మ్యూజియాలలో గొప్ప ప్రదర్శనలున్నాయి. ఈ రెండింటినీ నేను స్వయంగా చూడటమే గాక, రిఫ్ట్ వ్యాలీలోని కొంత భాగంలో ప్రయాణించాను. ఆధునిక మానవుని ఆవిర్భావం పరిస్థితి ఇది కాగా, ఆ ప్రాంతం నుంచి మాన వులు రెండు లక్షల సంవత్సరాల క్రితం నుంచి మొదలుకొని ప్రపంచం నలువైపులా ఎట్లా వలస వెళ్లారో, ఆ విధంగా 70 వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం మనం అంటున్న భారతదేశంలోకి ఏ విధంగా ప్రవేశించారో అనేక అధ్యయనాలున్నాయి.
తర్వాత వేల సంవత్సరాలలో ప్రపంచమంతటా జరిగినట్లే
ఇండియాలో కూడా లెక్కలేనన్ని జాతి సాంకర్యాలు జరిగాయి. పైన చెప్పుకున్నట్లు అప్పటికే ఇక్కడ స్వల్ప స్థాయిలో ప్రాథమిక మానవులు ఉండగా, తర్వాత కాలాలలో తూర్పు ఆసియా నుంచి మంగోలాయిడ్లు, మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్ర ప్రాంతం నుంచి ఆర్యులు, పశ్చిమాసియా నుంచి అరబ్బులు, పారశీకుల పూర్వీకులు ఇటువైపు వలసలు వస్తూ పోయారు. తిరిగి వీరందరి మధ్య సాంక ర్యాలు, వలసలు వేలకు వేల సంవత్సరాల పాటు సాగాయి. దేశంలోని అన్ని ప్రాంతాల స్త్రీ, పురుషుల డీఎన్‌ఏలపై జరిగిన ఆధునిక శాస్త్ర పరిశోధనలు, పురావస్తు పరిశోధనలు తేల్చిన విషయాలివి.
అయితే ఈ వలసలు, సాంకర్యాల క్రమంలో వేర్వేరు జాతులు, ప్రాంతాల మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని తరతరాలుగా నిలుపుకోవటం, కొన్నింటిని ఒక మేర కోల్పోవటం జరుగుతూ వస్తు న్నదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉదాహరణకు అండమాన్, నికో బార్ ఆదిమవాసి తెగలు, దేశంలోని మారుమూల అడవులలో నివసించే ఆటవిక జాతులకు ఇతరులతో సాంకర్యం దాదాపు లేనందున, వారిలో ఇప్పటికీ ఆఫ్రికన్ డీఎన్‌ఏ యథాతథంగా కనిపిస్తుందంటారు. అటువంటి స్థితిలో ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికి పాటుకు, వ్యతిరేక భావనకు గురి చేయాలి?
దక్షిణాది ప్రజలు, ఈశాన్య భారత లేదా తూర్పు భారత వాసులు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వారి రంగు తేడాలకు మూలాలు దీనంతటిలో ఉన్నాయి. దక్షిణ–ఉత్తర భారత భాషలు, సంస్కృతులు, దేవతలు, ఆలోచనా ధారల మధ్య, చివరకు రాజకీయాల మధ్య కనిపించే వ్యత్యాసాలకు గల మూలాలను శాస్త్రీయంగా శోధిస్తూ పోతే బోధపడేది ఇదే. ఆధునిక మానవుల ఆవిర్భావానికి, వారి వలసలకు, పరస్పర సాంకర్యాలకు లక్షలాది, వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది.
ఇందుకు ప్రపంచంలోని ఏ ప్రాంతంగానీ, భారతదేశంగానీ ఎంత మాత్రం మినహాయింపు కావు. పైన చెప్పుకొన్నట్లు, ఈ పరిణామ క్రమం ఒకవైపు అనంతంగా సాగుతూనే, మరొకవైపు అనేకులు తమ ఒరిజినల్ డీఎన్‌ఏలోని, ఒరిజినల్ లక్షణాలలోని కొన్ని భాగాలను అదేవిధంగా నిలుపుకొన్నారు. అట్లా ఎవరెంత నిలుపుకొన్నారు, అవి ఏ మేరకు నిలిచి ఉన్నాయనేది అనేక పరిస్థితులపై ఆధారపడి సాగుతూ వస్తున్నది.
ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు కన్నా ఉత్తరాదివారు, పశ్చిమ, తూర్పువాసుల రంగు తేడాగా ఉండటం సహజం. కానీ దానినిబట్టి వివక్షలు ఏర్పడాలంటే, తక్కిన ముగ్గురి లోనూ ఆఫ్రికన్ డీఎన్‌ఏ ఉంది. వారి పూర్వీకులు సైతం ఆఫ్రికన్లే. అటువంటపుడు, ఇంకా ఒక మేర మిగిలి ఉన్న రంగును బట్టి తరుణ్ విజయ్ అనే పెద్దమనిషి గానీ, మరొకరుగానీ, తమవంటి పూర్వీకులే గల దక్షిణ భారత ప్రజలను చిన్నచూపు చూడటం విజ్ఞతగల పని అవుతుందా? ఇంతకూ పిట్రోడా ఆ మాటలన్నది ఎందుకో తెలియదు గానీ, మానవ వికాస శాస్త్రం దృష్టితో, ప్రపంచవ్యాప్త వలసల చరిత్ర దృష్టితో, డీఎన్‌ఏ పరిశోధనల దృష్టితో సరిగా ఇవే మాటలను ఇప్పటికి ఎందరో అన్నారు, రాశారు. ఎన్నికల సమయం గనుక ఇది అధికార పక్షానికి ఒక మంచి ఆయుధంగా మారింది.
ఈ సందర్భంలో మరొకటి గుర్తుకు వస్తున్నది. ఆర్యుల, ఉత్తరాది వారి ఆధిపత్యంగల పార్టీలు, ప్రభుత్వాలు ద్రవిడుల దక్షిణాదిని రాజకీయంగా జయించాలని, తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవా లని ప్రయత్నిస్తున్నాయని, నిరంతరం వివక్షకు గురి చేస్తున్నాయనే వాదనలు పెరియార్ రామస్వామి తర్వాత, హిందీ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక ఉద్యమాల తర్వాత ఇప్పటికీ ముందుకు వస్తుంటాయి. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment