అభిప్రాయం
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గెలుపుపై నమ్మకం సన్న గిల్లో, లేక చెప్పుకోడానికి మరేం లేకనో కొంతమంది రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలను ఆశ్రయించారు. విద్వేషాన్ని రగిలించే ఈ ప్రసంగాలు సత్యదూరమైన ఆరో పణలతో కూడినవి. ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ ఈ దేశంలోని ముస్లింలను చొర బాటుదారులుగా అభివర్ణించడం దారుణం. ముస్లిం ప్రజలందరికీ ఇది అవమానకరం. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోను ‘ముస్లిం లీగ్‘ మేనిఫెస్టోగా పెర్కొనడం ప్రధాని స్థాయికి తగినది కాదు.
‘ఇండియా’ కూటమి వస్తే మీ ఇంటిలోని బంగారం, మంగళసూత్రాలతో సహా అంతా దోచి ముస్లింలకు కట్టబెడతారు అనడం అథమ స్థాయి వాదన.
ఎన్నో సర్వేల్లో తేలిన వాస్తవాల ప్రకారం దేశం మొత్తం మీద ముస్లింల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. దేశంలో జైళ్లలో మగ్గుతున్న వారిలో దళితులు, ఆదివాసీల లాగానే ముస్లింలు కూడా వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు వైఎస్సార్ సారథ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం లోనే మొట్ట మొదటి సారి ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది. మోదీ తన ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్‌ను ప్రస్తావిస్తూ ఇతర బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వచూపు తున్నారు అని విమర్శించడం అవాస్తవమే గాక శోచనీయం.
మోదీ బాటలో నడుస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషం వెదజల్లుతున్నారు. యాదృచ్ఛికంగానో, ఆకతాయి మూకల వల్లో జరిగిన ఆలయ రథ అగ్నిప్రమాదాన్నీ, ఒక విగ్రహానికి జరిగిన హానినీ ఆ యా ప్రాంతాల సభలలో ఒకటికి పది సార్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వమే అటువంటివి చేయించింది అనే అర్థాన్ని స్ఫురించేలా అపోహలకి తెరలేపు తున్నారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా వందల కొద్దీ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని బహిరంగ సభలలో అరవడం ఒక బాధ్యతా యుతమైన నేత పని అనిపించుకుంటుందా? మత విద్వేషాలు అనే ఊసు ఎప్పుడూ లేని ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి ప్రసంగాలు చేయడం ఒక అమానుష చర్య.
మరి కొన్ని సభల్లో ప్రజలను ‘మీకు సిగ్గు లేదా’, ‘పౌరుషం లేదా’ ‘మీరు రోడ్లు ఎక్కి వీళ్లకి బుద్ధి చెప్పరా’ అని అనడం వారిని ప్రత్యక్ష హింస వైపు ప్రేరేపించడమే. ఒక వైపు 2016లో చంద్ర బాబు హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ ఆందో ళన, తుని రైలు విధ్వంసం సంఘటనలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేయించింది అనే నిందను వేశారు.
అదే నోటితో జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టిన సందర్బంగా 2022లో జరిగిన మంత్రి ఇల్లు దగ్ధం సంఘటనకు కూడా జగనే కారకుడు అనడంలో ఔచిత్యం ఏంటి? ఈ రెండు సునిశితమైన అంశాలను ఎన్ని కల వేళ మళ్ళీ తెర మీదకి తెచ్చి విద్వేషాలను రగిలించే తత్వం చాలా తప్పు. అసలు కాపు రిజర్వేషన్ సమస్యపై తనది, తన కూటమి వైఖరి ఏంటో చెప్పకుండా వైసీపీ లోని కాపు నేతలను కించ పరుస్తూ వారి నియోజక వర్గాల్లోనే అవమా నించడం ఒక అక్కసుతో, ద్వేషంతో కూడిన అజెండాలో భాగమే.
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ‘కరుడు కట్టిన ఉగ్రవాది’ అని వర్ణించటం అత్యంత గర్హనీయ చర్య. ఈ మాటల్లో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనిపి స్తుంది. ప్రజలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఉగ్రవాది ఎలా అవుతారు? విధాన పరంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇటు వంటి మాటలు వాడితే ఎదురుదెబ్బ తగలడం ఖాయం.
ఈ విధంగా కూటమి నేతలు మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ముగ్గురూ విద్వేషాన్ని రగిలిస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల దయ్యింది. ఇంతగా విలువలకు తిలోద కాలు ఇచ్చిన వైనం చూస్తే ఓటమి భయం వారిని వేధిస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా పెద్ద హామీలు ఏమీ ఇవ్వక పోవడం. ‘ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మెరుగు చేస్తాం’ అంటూ ముందుకు వచ్చిన జగన్ తన ఓటు బ్యాంకుపై ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నా రని దీన్నిబట్టి అర్థమవుతోంది.
ఇలాగే 2009లో అప్పటి వైఎస్‌ఆర్ కూడా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక ఎటువంటి కొత్త హామీలు ఇవ్వకపోయినా ప్రజలు తమ నమ్మకాన్ని మళ్ళీ ఆయనపై ఉంచి ప్రతిపక్ష మహాకూటమిని చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇప్పుడు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టిన ఆ చరిత్ర పునరావృతం అవుతుందనిపిస్తోంది.
డా‘‘ జి. నవీన్
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
naveen.prose@gmail.com
Comments
Please login to add a commentAdd a comment