వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు, డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ధి, సుపరిపాలన
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రం
తొలి విడత ప్రచారంలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం
మలి విడత ప్రచారంలో మండుటెండ, ఉక్కుపోతతో పోటీపడుతూ జన నీరాజనం
రూ.800 కోట్లతో ఉద్ధానం తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం నిర్మించిన పలాసలో వైఎస్సార్‌సీపీ ఓటమి
రూ.500 కోట్లతో వైద్య కళాశాల, రూ.ఐదు వేల కోట్లతో పోర్టు నిర్మించిన మచిలీపట్నంలోనూ అదే ఫలితం
వైఎస్సార్‌సీపీ కంచుకోటలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూటమి పాగా
తప్పక విజయం సాధించాల్సిన చోట్ల టీడీపీ కూటమి గెలుపుపై నివ్వెరపోతున్న విశ్లేషకులు
ఇంతలా టీడీపీ కూటమి విజయానికి కారణాలు అంతుచిక్కడం లేదంటోన్న రాజకీయ పండితులు
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 99% అమలు చేశారు. ఐదేళ్లుగా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. పారదర్శకంగా అర్హులందరికీ నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేసి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు.
జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతకు దన్నుగా నిలిచారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన అందించిన సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలలో నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు.
ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలకు ఊళ్లకు ఊళ్లు జనం కదలివచ్చి సంఘీభావం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో నిర్వహించిన రోడ్ షోలకు కిలో మీటర్ల పొడవున జనం బారులు తీరి.. మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండుటెండలో జగన్ సభలకు జనం పోటెత్తారు.
ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చినా..
సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచార సభల్లో.. ‘మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటు వేసి ఆశీర్వదించేందుకు మీరంతా సిద్ధమా’ అని జగన్ పిలుపునిస్తే.. మేమంతా సిద్ధం సిద్ధం.. అంటూ లక్షలాది మంది ప్రజలు పిడికిళ్లు బిగించి నినదించారు. కానీ.. వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ఎన్నికల ఫలితం టీడీపీ కూటమికి దక్కడంపై రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది.
ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ రూ.800 కోట్లతో తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం, కిడ్నీ వ్యాధుల చికిత్సకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిరి్మంచినా.. పలాస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రూ.8 వేల కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరంలలో పూర్తి చేశారు.
గతేడాది నుంచే ఆ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కానీ.. ఆ ఐదు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, మచిలీపట్నం నియోజకవర్గాల్లో రూ.25వేల కోట్లతో పోర్టులు నిరి్మస్తున్నారు. కానీ.. ఆ పోర్టులు ఉన్న నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ గెలవక పోవడంపై రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు.
కంచుకోటల్లోనూ కూటమి పాగా
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలు వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. కానీ.. ఈ ఎన్నికల్లో ఆ కంచుకోటల్లోనూ ఎన్నడూ లేని రీతిలో టీడీపీ గెలుపొందడటంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ నిలవాల్సిన చోట్ల టీడీపీ కూటమి నిలవడంపై ఆశ్చర్యపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ఫలితం టీడీపీకి దక్కడానికి కారణాలు అంతుచిక్కడం లేదని రాజకీయ పండితులు వాపోతున్నారు.
ఇటీవల యాక్సెస్ మై ఇండియా చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ మహిళలు, గ్రామీణులు భారీ ఎత్తున జగన్‌కు మద్దతుగా నిలిచారని చెప్పడం.. ఎన్‌డీటీవీ ప్రణయ్ రాయ్ కూడా పలు సందర్భాల్లో గ్రామీణులు, మహిళలు, మైనార్టీ లు జగన్‌కు అండగా ఉన్నారని స్పష్టం చేసిన నేపథ్యంలో ఫలితాలు ఇలా వెలువడటం సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment