సీఎం జగన్ సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు
4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు
రామాయపట్నం పోర్టు వద్ద భారీగా పరిశ్రమలు వస్తున్నాయి
పోర్టులు కట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, అభివృద్ధిని వేగవంతం చేశారని తెలిపారు. నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లను సీఎం జగన్ నిర్మిస్తున్నారని చెప్పారు. పోర్టులు పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తాయని, రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వివరించారు.
సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు పోర్టులు నిర్మించే ఆలోచన చేయలేదని నిలదీశారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయని, వచ్చే ఏడాది మరో ఐదు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలుస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. వైజాగ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగించే సీఎం జగన్ కావాలా, జన్మభూమి కమిటీలతో దోచుకున్న చంద్రబాబు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గత 59 నెలలుగా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటి వద్దకే లబ్ధిదారులకు అందించారు. గత 59 నెలల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు.
ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్లు ప్రజలకు చేరాయి. సీఎం జగన్ 16 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు అందించారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు వ్యాపారాలు చేస్తూ సంపాదనను మెరుగుపర్చుకుంటున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల కోటికి పైగా కుటుంబాలు వాటి కాళ్లపై అవి నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది. రాష్ట్రం అభివృద్ధి చెందిందనడానికి ఇదొక నిదర్శనం’ అని తెలిపారు.
‘చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలు బాగా దెబ్బతిన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాల మహిళలు 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయిపడిన రూ.25 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యుల సంఖ్య 1.15 కోట్లకు పెరిగింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. సీఎం జగన్ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించారు. ఇంటి స్థలం లేని 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇంటి స్థలం ఇచ్చారు. వారి సొంతింటి కలను సాకారం చేస్తూ పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు’ అని వివరించారు.
జీఎస్‌డీపీ 4.87 శాతానికి పెరుగుదల
చంద్రబాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 4.47 శాతం ఉంటే.. వైఎస్ జగన్ హయాంలో జీఎస్‌డీపీ 4.87 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్‌డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం. ఇది అభివృద్ధి కాదా? కోవిడ్ రెండేళ్లు ఉన్నా ఎలా సాధ్యమైంది? ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన పథకాలు సకాలంలో ఇవ్వడంతో ఎకానమీ యాక్టివిటి పెరగడంతో అభివృద్ధి జరిగింది. దాని వల్లే జీఎస్‌డీపీ పెరిగింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎంఎస్‌ఎంఈలు 1.9 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగాయి. భారీ పరిశ్రమలు వచ్చాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో నిరుద్యోగం 5.2 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది.
ఇది అభివృద్ధి కాదా? రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో టీడీపీ హయాంలో 7.5 శాతం ఉంటే.. వైఎస్సార్‌సీపీ హయాంలో 5.5 శాతం మాత్రమే. కేంద్రం అప్పు జీడీపీలో 6.6 శాతంగా ఉంది. రాష్ట్రంలో మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్సె్పండిచర్) టీడీపీ హయాంలో రూ.12 వేల కోట్లు ఉంటే.. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.15 వేల కోట్లకు పెరిగింది. ఇవన్నీ కేంద్రం చెప్పిన లెక్కలే. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అంతా కేంద్రమే ఇచ్చిందని అంటున్నారు. కానీ.. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే సాయం తగ్గింది. అయినా సరే రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నిలపగలిగారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment