రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..! | Sakshi
Sakshi News home page

రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!

Published Sat, May 4 2024 5:40 PM

Nurse Who Killed 17 Patients Jailed For Over 700 Years

వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని  దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా,  కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి.  కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా  ప్రవర్తించింది.  రాక్షసిలా మారి  రోగులను పొట్టన బెట్టుకుంది.   ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!

అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.

మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ  కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.

ప్రెస్‌డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు.  బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.

ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు  నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.  ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె  నర్సింగ్ లైసెన్స్ రద్దు  చేశారు. 

‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.

రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు.  అంతేకాదు  ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య  కాలంలో   రోగుల పట్ల తన అసంతృప్తిని  మెస్సేజ్‌లను పంపించిందట.

ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది.  గుండెపోటుకు కూడా దారితీస్తుంది.  చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది.
 

Advertisement
Advertisement