Rajshri Deshpande: సోషల్‌ స్టార్‌ | Sakshi
Sakshi News home page

Rajshri Deshpande: సోషల్‌ స్టార్‌

Published Sat, Apr 20 2024 6:23 AM

Rajshree Deshpande: social work is a moral responsibility - Sakshi

అదర్‌ సైడ్‌

చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన రాజశ్రీ దేశ్‌పాండేకి ఆర్థిక కష్టాలు తెలుసు. ‘డబ్బు మాత్రమే అన్ని సమస్యలకు çపరిష్కారం’ అని ఒకప్పుడు అనుకున్న మాట తప్పు అని తెలుసు.
ఔరంగాబాద్‌ నుంచి ముంబై వరకు తన ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకుంది. బాలీవుడ్‌లో నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాజశ్రీ దేశ్‌పాండే సేవాపథంలో పయనిస్తోంది, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి సేవా కార్యక్రమాలను విస్తరిస్తోంది...


గత సంవత్సరం వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ షో ‘ట్రయల్‌ బై ఫైర్‌’ నటిగా రాజశ్రీకి ఎంతో పేరు తీసుకువచ్చింది. ఎన్నో అవార్డ్‌లు వచ్చాయి, 1997లో వచ్చిన ‘ఉప్‌హార్‌’ సినిమా ఆధారంగా వచ్చిన ‘ట్రయల్‌ బై ఫైర్‌’లో లీడ్‌ రోల్‌ ΄ోషించింది రాజశ్రీ. మరాఠీ చిత్రం ‘సత్యశోధక్‌’లో సావిత్రిబాయి ఫూలే పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చింది.

ఒకవైపు నటిస్తూనే మరో వైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటుంది. మహారాష్ట్రలోని కరువు బారిన పడిన 30 గ్రామాలలో సహాయక కార్యక్రమాలలో పాల్గొంది. తన స్వచ్ఛంద సంస్థ ‘నభాంగన్‌’ ఫౌండేషన్  ద్వారా ఎన్నో గ్రామాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ నుంచి పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. జెండర్‌ సెన్సిటైజేషన్‌పై ఎన్నో సదస్సులు నిర్వహించింది.

గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్న రాజశ్రీ ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకుంది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తోంది. నటిగా తనకు వచ్చిన ఆదాయంతో పాటు క్రౌడ్‌ ఫండింగ్, డొనేషన్స్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులను సేకరిస్తోంది.

‘ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లడం అంటే ఇష్టం’ అంటున్న రాజశ్రీ ముంబై చుట్టుపక్కలప్రాంతాల్లో బీచ్‌ ప్రక్షాళన, నదుల పున రుజ్జీవనానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటుంది. ‘ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పబ్లిసిటీ వస్తుంది అనే దృష్టితో కాకుండా సమస్య మూలాన్ని అర్థం చేసుకొనే కోణంలో నిజాయితీగా పనిచేయాలి’ అంటుంది రాజశ్రీ.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పెరిగిన రాజశ్రీకి తమ కుటుంబ ΄÷లాన్ని పరిశ్రమలు ఎలా లాక్కున్నదీ బాగా గుర్తుంది. తల్లిదండ్రులు చిన్నా చితకా ఉద్యోగాలు చేసేవారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడినా కుమార్తెల చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. పుణేలో లా చేస్తూనే మరోవైపు డబ్బుల కోసం అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో పనిచేసేది రాజశ్రీ.

స్కూలు రోజుల్లో నాటకాల్లో నటించి ‘శభాష్‌’ అనిపించుకుంది. ‘నటన’పై ఆసక్తి అక్కడే ఆగి΄ోలేదు. ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ముంబైకి వెళ్లి ఫిల్మ్‌ కోర్సు చేసేలా చేసింది. అయితే తన అభిరుచే వృత్తిగా మారుతుందని, నలుగురిలో గుర్తింపు తెస్తుందని ఊహించలేదు.

2012లో ఒక సంవత్సరం పాటు హిందీ టెలివిజన్‌ సీరియల్‌లో నటించింది. ‘తలాష్‌’ ‘కిక్‌’లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. 2015లో వచ్చిన ‘యాంగ్రీ ఇండియన్‌ గాడెసెస్‌’ చిత్రం ఆమె కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ‘ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు’ అంటూ వేరే ప్రపంచం వైపు తొంగి చూడడానికి బొత్తిగా టైమ్‌ దొరకని టైమ్‌ అది. అయితే రాజశ్రీ మాత్రం ‘నేనూ నా కెరీర్‌’కు అని మాత్రమే అనుకోకుండా సామాజిక విషయాలపై కూడా దృష్టి పెట్టేది.

ఆ టైమ్‌లో నేపాల్‌ భూకంప బాధితుల కోసం చేపట్టిన సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది, ‘నా సమస్యలు అన్నిటికీ డబ్బుతోనే పరిష్కారం దొరుకుతుంది అని అనుకునేదాన్ని. నేను చాలా సంపాదించాను. అయినప్పటికీ నేను సంతోషంగా లేనన్న విషయం గ్రహించాను’ అంటున్న రాజశ్రీ సేవాపథంపై దృష్టి సారించింది. ఆ బాటలో నడవడంలో తనకు మానసిక శాంతి లభిస్తోంది. డబ్బు కంటే విలువైన అనుభవాలను ఇస్తోంది.

‘నేను ఏమీ మారలేదు. అప్పటిలాగే ఉన్నాను’ అని రాజశ్రీ నోటి నుంచి వినిపించే మాట. కాళ్లు భూమి మీద నిలిచేలా ఉంచే మాట. ‘వ్యక్తిగత అనుభవాలు నటనపై ప్రభావం చూపుతాయి’ అంటారు. సేవాకార్యక్రమాల ద్వారా ఈ ప్రపంచాన్ని రకరకాల కోణాలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న రాజశ్రీ దేశ్‌పాండే నటనపై కూడా తన నటజీవితానికి ఆవల ప్రపంచానికి సంబంధించిన అనుభవాల ప్రభావం ఉంది.

మనలోకి మనం
కేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్నో సమస్యల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించే సామర్థ్యం సొంతం అవుతుంది. సినిమా వెలుగులు అక్కడ చిన్నబోతాయి. మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి.
– రాజశ్రీ దేశ్‌పాండే

Advertisement
Advertisement