
పాలస్తీనా అనుకూల నిరసనకారుల శిబిరాలు ధ్వంసం
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్‌లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్‌మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు.
ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి.
Comments
Please login to add a commentAdd a comment