సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్య గెలుపు
పరుగు తేడాతో ఓడిన రాజస్తాన్ రాయల్స్
నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు
రాణించిన భువనేశ్వర్
సన్‌రైజర్స్‌పై 202 పరుగుల లక్ష్యఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్‌కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్ బౌలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీయగా, 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా, భువనేశ్వర్ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా రాయల్స్ కోల్పోగా, ఓటమి అంచుల నుంచి హైదరాబాద్ ఒక పరుగుతో గట్టెక్కింది.
సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భువనేశ్వర్‌కు (3/41) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నితీశ్ ధమాకా...
పవర్‌ప్లే ముగిసేసరికి 2 వికెట్లకు 37 పరుగులు... ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ చేసిన అత్యల్ప పరుగులివి. దీనిని చూస్తే రైజర్స్ 200 పరుగులకు చేరగలదని ఎవరూ ఊహించలేదు. అభిషేక్ శర్మ (12), అన్‌మోల్‌ప్రీత్ (5) విఫలం కాగా... హెడ్ అప్పటికి 17 బంతుల్లో 18 పరుగులే చేసి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది.
చహల్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది హెడ్ జోరు ప్రదర్శించగా... నితీశ్ తన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. 10 ఓవర్ల తర్వాత స్కోరు 75 పరుగులకు చేరింది. 37 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. చహల్ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లతో నితీశ్ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు హెడ్‌ను బౌల్డ్ చేసి అవేశ్ ఈ జోడీని విడదీయగా, కొద్ది సేపటికి 30 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఆఖరి 5 ఓవర్లలో రైజర్స్ బ్యాటర్లు నితీశ్, క్లాసెన్ మరింత చెలరేగడంతో 70 పరుగులు వచ్చాయి. అశ్విన్ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు కొట్టిన నితీశ్... అవేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మరోవైపు చహల్ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదిన క్లాసెన్... చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి స్కోరును 200 పరుగులు దాటించాడు.
కీలక భాగస్వామ్యం...
భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి బట్లర్ (0), ఐదో బంతికి సామ్సన్ (0) అవుట్... రైజర్స్ పైచేయి! కానీ 7 పరుగుల వద్ద యశస్వి ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కమిన్స్... 24 పరుగుల వద్ద పరాగ్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన అభిషేక్... అంతే... ఆట రాజస్తాన్ వైపు మొగ్గింది. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి, పరాగ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు.
వికెట్లు పడినా వీరిద్దరు ధాటిగా ఆడి పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఇద్దరూ బ్యాటర్లు రైజర్స్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఒకే ఓవర్లో యశస్వి 30 బంతుల్లో, ఆ తర్వాత 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
అయితే విజయం వైపు దూసుకుపోతున్న దశలో వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత కీలక సమయాల్లో మరో మూడు వికెట్లు చేజార్చుకున్న రాయల్స్ ఓటమిని ఆహా్వనించింది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అవేశ్ 58; అభిషేక్ (సి) జురేల్ (బి) అవేశ్ 12; అన్‌మోల్‌ప్రీత్ (సి) యశస్వి (బి) సందీప్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 76; క్లాసెన్ (నాటౌట్) 42; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–35, 3–131. బౌలింగ్: బౌల్ట్ 4–0–33–0, అశి్వన్ 4–0–36–0, అవేశ్ 4–0–39–2, సందీప్ శర్మ 4–0–31–1, చహల్ 4–0–62–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) నటరాజన్ 67; బట్లర్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సామ్సన్ (బి) భువనేశ్వర్ 0; పరాగ్ (సి) జాన్సెన్ (బి) కమిన్స్ 77; హెట్‌మైర్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 13; పావెల్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 27; జురేల్ (సి) అభిõÙక్ (బి) కమిన్స్ 1; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–135, 4–159, 5–181, 6–182, 7–200.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–41–3, జాన్సెన్ 4–0–44–0, కమిన్స్ 4–0–34–2, నటరాజన్ 4–0–35–2, ఉనాద్కట్ 2–0–23–0, నితీశ్ కుమార్ రెడ్డి 1–0–12–0, షహబాజ్ 1–0–11–0.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X కోల్‌కతా
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment