మోసాల బాబు మరో అబద్ధం.. | Chandra Babu false promise to students | Sakshi
Sakshi News home page

మోసాల బాబు మరో అబద్ధం..

Published Fri, May 3 2024 5:41 AM | Last Updated on Fri, May 3 2024 5:41 AM

Chandra Babu false promise to students

ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 

2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది 

ఇంటర్‌ విద్యార్థులు మరో 10,52,221 మంది.. 

ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం  

ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు  

ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం  

పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు 

ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం   

సాక్షి, అమరావతి: నిజం చెప్పకపోవడం.. మాటమీద నిలబడకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం. అందుకే ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీసారి అలవోకగా ఎడాపెడా హామీలిచ్చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటివి ఎన్నో ప్రకటించారు. అందులో మూడ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ‘స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు’ అన్న ఓ అబద్ధపు హామీ కూడా ఇలాంటిదే. నిజానికి.. ఇది ఏ విధంగా చూసినా ఆచరణ సాధ్యంకాదంటున్నారు ఆర్థిక నిపుణులు. 

ఈ స్థాయిలో రాష్ట్రంలోని 82.29 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో భారీ మొత్తాన్నే ఈ ఒక్క పథకానికే ఖర్చుచేయాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని వారు వట్టి మాటగా కొట్టిపడేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో చెబుతూ ఏటా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ‘యూనిఫైడ్‌ డి్రస్టిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌’ (యూడైస్‌) కింద నివేదికను అందజేస్తుంటాయి. దీని ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో 1–10 తరగతుల్లో 71,77,637 మంది, ఇంటర్మీడియట్‌లో 10,52,221 మంది కలిపి మొత్తం 82,29,858 మంది విద్యార్థులున్నారు. 

టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి అక్షరాలా రూ.1,23,44,78,70,000లు అవసరమవుతుంది. సులభంగా చెప్పాలంటే రూ.1,234 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఏటా అమ్మఒడి కింద రూ.6,452 కోట్లు ఖర్చుచేస్తుండగా, దీనికి రెండింతలు ఇస్తానని చంద్రబాబు అలవోకగా ఓ అందమైన అబద్ధపు హామీని ఇచ్చిపడేశారు. 

ప్రభుత్వ విద్యపై చంద్రబాబు కక్ష.. 
వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు చంద్రబాబునాయుడు కొమ్ముకాశారు. 2014–19 మధ్య సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని, వాటిని కల్పించే పరిస్థితి లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ప్రకటించారు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం ఒక ఎత్తయితే.. 117 జీఓను రద్దుచేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. 

ఇదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు విద్యకు దూరం కావడం ఖాయం. ఇక గతంలో ఒక స్కూలుకు మంజూరైన పోస్టులను పిల్లలున్నా లేకున్నా కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ, జాతీయ విద్యా విధానం–2020 ప్రకా­రం బడిలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నేపథ్యంలో.. తక్కువ విద్యార్థులు, ఎక్కువమంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ఎక్కువ విద్యా­ర్థులున్న స్కూలుకు వారిని బదిలీ చేసేందుకు వీలుగా 2022 జూన్‌లో జీఓ–117 తీసుకొచ్చింది.

 దీంతో పోస్టులను రద్దుచేయకుండా అదనపు ఉపాధ్యాయులను ఎక్కువమంది పిల్లలున్న స్కూలుకు బదిలీ చేయవచ్చు. పేద విద్యార్థులకు ఎంతో మేలుచేసిన ఈ జీఓను ఉపాధ్యాయ వర్గాలూ స్వాగతించాయి. ఫలితంగా.. ప్రభు­త్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులోకి వచ్చారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 117 జీఓను రద్దుచేస్తే.. ప్రభుత్వ విద్య నాశ­నం కావడంతో పాటు, విద్యార్థులు తక్కు­వగా ఉన్నారన్న సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసేందుకు ఆస్కారం ఉంది.

జగన్‌ సర్కారులో విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం
2019లో ప్రభుత్వం ఏర్పాటుచేశాక సీఎం జగన్‌  ప్రభుత్వ విద్యపై దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన 
విద్య అందించాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్‌వాడీ నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం కరిక్యులమ్‌లో మార్పులు చేశారు. ఉదా.. 
» ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులోకి తేవడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా బైలింగ్వుల్‌ పాఠ్యపుస్తకాలు, తెలుగు–ఇంగ్లిష్‌ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని ప్రభుత్వం ఉచితంగా అందించింది.  
»  ప్రతి పేదింటి బిడ్డను బడికి పంపించాలని, ఇలా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసింది.  
» విద్యార్థి తప్పనిసరిగా బడిలో ఉండేలా చూసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది.  
»  కోవిడ్‌ రెండేళ్లు మినహా మిగిలిన సంవత్సరాల్లో హాజరును పరిగణనలోకి తీసుకుని నాలుగు పర్యాయాలు  రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేసింది.

సగటున ఏటా రూ.6,452 కోట్లు జమ 
ఈ పథకం కింద 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020–21లో  44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021–22లో 42,62,419 మందికి రూ.6,393.6 కోట్లు, 2022–23 విద్యా  సంవత్సరంలో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.9 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.25,809.50 కోట్లు అందించింది. 

అంటే.. సగటున ఏడాదికి రూ.6,452.37 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే, 2024 మేని ఫెస్టోలో రూ.15వేల అమ్మఒడి మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలుచేయనుంది. కానీ, చంద్రబాబు మాత్రం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఇస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement