సాక్షి, అమరావతి: ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మహా నేర్పరి. 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ప్రజలను నిలువునా ముంచారు. రైతు రుణాలు రూ.87వేల కోట్లకు పైబడి ఉంటే... దాన్ని ఐదు విడతల్లో ఇస్తానని చెప్పి మూడు విడతలు... అది కూడా తూతూ మంత్రంగానే ఇచ్చారు. నాటి ప్రభుత్వ తీరుతో రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
♦ డ్వాక్రా, చేనేత రుణాల మాఫీని పూర్తిగా తుంగలో తొక్కారు. కోటయ్య కమిటీ తన నివేదికలో డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని సిఫారసు చేసినా పట్టించుకోలేదు. రుణాలు మాఫీ చేయకపోవడంతో వాటిపై వడ్డీలు పెరిగిపోయి మహిళలు బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘాలు ఎన్‌పీఏలుగా (నిరర్థక ఆస్తులు) మారాయి. క్రెడిట్ రేటింగ్‌ను కోల్పోయి రుణాలకు అనర్హులయ్యారు.
♦ మద్యం బెల్టు షాపుల రద్దు చేస్తానని ప్రకటించి ఆ పని చేయకపోగా ప్రతి గల్లీకి వాటిని విస్తరించారు.
♦ రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ ఊసే ఎత్తలేదు.
♦ పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రూ.30 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానని ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారు.
♦ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తానని ప్రకటించినా దాన్ని అమలు చేయకుండా యువత, విద్యార్థులను మోసం చేశారు. పైగా ప్రభుత్వ ఉద్యోగులను 2 లక్షలకుపైగా కుదించి అన్యాయం చేశారు.
♦ ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేకపోతే ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నీరుగార్చారు. ఎన్నికలకు మూడు నెలలు ఉందనగా కొద్దిమందికి భృతి పేరుతో చేతులు విదిల్చి వారిని మభ్యపెట్టారు.
♦ పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానని ఇవ్వలేదు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.
♦ బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలిస్తానని చెప్పి ఇవ్వలేదు. బీసీలకు రూ.10 వేల కోట్ల బడ్జెట్ పెడతానని చెప్పి మోసం చేశారు. కాపులకు ఏటా వెయ్యి కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఇస్తానని చివరికి రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
♦ ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ ఇస్తానని ఇవ్వలేదు. నిరుద్యోగులకు రూ.50 లక్షల వరకు రుణం ఇస్తానని పట్టించుకోలేదు.
♦ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు ఇస్తామని ఇవ్వలేదు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి పట్టించుకోలేదు.
♦ రూ.500 కోట్లతో బ్రాహ్మణుల కోసం నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారు.
♦ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వాటి గురించి ప్రజలు అడుగుతారని భయంతో ఏకంగా మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్‌సైట్ నుంచే తొలగించిన చరిత్ర చంద్రబాబుది.
మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపరే!
Published Thu, Oct 26 2023 3:38 AM | Last Updated on Thu, Oct 26 2023 7:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment