స్వేచ్ఛా మార్కెట్‌ పరిష్కారం కాదు! | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛా మార్కెట్‌ పరిష్కారం కాదు!

Published Sat, Mar 30 2024 12:22 AM

The free market is not the solution - Sakshi

గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం.

భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం  నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి.

భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్‌ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్‌ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్‌లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్‌లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్‌ చేశాయి.

స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్‌ పేసన్‌’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్‌లలో రైతులు ఉక్రె యిన్‌ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు.

పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్‌ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

‘డౌన్‌ టు ఎర్త్‌’ మ్యాగజైన్‌ సంకలనం ప్రకారం, యూరప్‌లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్‌–యూరోప్‌ మీడియా నెట్‌వర్క్‌ అయిన ‘యూరాక్టివ్‌’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్‌ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్‌ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్‌ కమిషన్‌ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది.

వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్‌ యూనియన్‌ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్‌ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్‌ డైరెక్టివ్‌’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్‌పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి.

వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్‌బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది.

కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్‌ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్‌ వైఫల్యం ఫలితంగా కోవిడ్‌ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. 

వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్‌ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్‌ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్‌ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది.

కాబట్టి స్వేచ్ఛా మార్కెట్‌ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్‌లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి.

- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్‌ శర్మ
- ఈ–మెయిల్‌: hunger55@gmail.com

Advertisement
Advertisement