ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Election Commission | Sakshi
Sakshi News home page

ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల

Published Wed, May 15 2024 6:46 PM | Last Updated on Wed, May 15 2024 7:42 PM

Sajjala Ramakrishna Reddy Comments On Election Commission

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.

రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్‌ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్‌ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.

‘‘రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్‌ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్‌ అబ్జర్వర్‌ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్‌ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్‌ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.

పోలింగ్‌ రోజు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.

జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.

‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన  జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్‌ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్‌ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement