అబ్బురపరిచిన ‘అనంత’ భావోద్వేగం | Sakshi
Sakshi News home page

అబ్బురపరిచిన ‘అనంత’ భావోద్వేగం

Published Mon, Mar 18 2024 6:16 AM

Sakshi Guest Column On Anant Ambani Wedding

సందర్భం

కళ్లు చెదిరే ఐశ్వర్యం, దేన్నయినా క్షణాల్లో సాధించగల అధికారం, కుటుంబ విలువల పట్ల అచంచల విశ్వాసం, భగవంతుడిపై అంతులేని భక్తి... ఇవన్నీ ఒకే కుటుంబంలో కలగలిసి వుండటం ఊహాతీతం. కానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ‘అంబానీ పరివార్‌’ వీటన్నిటి సమ్మేళనం అని మరోసారి రుజువైంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజులపాటు ఈమధ్య జరిగిన ప్రీ వెడ్డింగ్‌ సంబరాలు దేశంలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగనివి. కానీ వీటన్నిటి కంటే అందరికీ ఆసక్తి కలిగించింది మరొకటుంది.

అది జూలైలో పెళ్లికొడుకు కాబోతున్న అనంత్‌ అంబానీ చేసిన ప్రసంగం! చిన్ననాటి స్నేహితురాలూ, ప్రియురాలూ అయిన రాధికా మర్చంట్‌తో ఆయనకు వివాహం అవుతున్న సందర్భంగా ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. వర్తమాన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులు, కార్పొరేట్‌ కుబేరులు, బాలీవుడ్‌ అగ్రతారలు, క్రికెటర్లు సకుటుంబ సమేతంగా వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హాజరయ్యారు. 

అనంత్‌ అంబానీ చేసిన ప్రసంగం అందరి మనసులనూ మెలిపెట్టింది. కుమారుడి ప్రసంగం వింటూ ముఖేష్‌ దంపతులైతే కంటతడి పెట్టారు. 2003లో కరణ్‌ థాపర్‌ ‘బీబీసీ’ కోసం ముఖేష్‌–నీతా దంపతులను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా నీతాను ‘మీ దృష్టిలో డబ్బంటే ఏమిటి?’ అని అడిగినప్పుడు ‘డబ్బు దానికదే అంతిమ లక్ష్యం కాదు... దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం’ అని చెబుతూ ఒక మాటన్నారు.

‘డబ్బు సంపాదన, సంపద జీవితం కానే కాదు... కొన్ని అపురూప చిరస్మరణీయ జ్ఞాపకాలను నిర్మించుకోవటమే జీవితం’ అని చెప్పారు. అనంత్‌ హృదయాంతరాళాల్లోంచి పెల్లుబికి వచ్చిన మాటల వెనక ఆ విలువల జీవశక్తి నిండివుందనీ, ఆ దంపతుల పెంపకం అతణ్ణి తీర్చిదిద్దిందనీ అనిపిస్తుంది.

ఏమన్నారూ అనంత్‌? తన కుటుంబసభ్యులంతా తన కోసం, తన సుఖ సంతోషాల కోసం పడుతున్న శ్రమను వివరించారు. తనకున్న ప్రత్యేక అనారోగ్య సమస్యల నేపథ్యంలో అమ్మానాన్నలిద్దరూ అనుక్షణమూ తనను అపురూపంగా చూసుకున్న వైనాన్ని కళ్లకు కట్టారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అత్యంత విలక్షణంగా ఉండాలన్న తపనతో గత కొన్ని నెలలుగా రోజుకు కనీసం 20 గంటలు తన కుటుంబసభ్యులంతా పడిన కఠోర శ్రమను గుర్తుకు చేసుకున్నారు.

అందరూ అనుకుంటున్నట్టు తన జీవితం పూలపాన్పు కాదనీ, చిన్ననాటినుంచీ భరించలేని బాధల ముళ్లు వేధిస్తూనే ఉన్నాయనీ చెప్పారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే క్రమంలో వాడక తప్పని స్టెరాయిడ్స్‌ చివరకు ఊబకాయానికి కారణమైన తీరును తెలిపారు.

సాధారణంగా 25–30 ఏళ్ల మధ్యనుండే సంపన్న కుటుంబాల యువతలో చాలా సందర్భాల్లో విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం కనబడుతూ ఉంటుంది. ఇంగ్లిష్‌ తప్ప ఏదీ మాట్లాడలేరు. 

ఈ వేడుకల సందర్భంగా ‘న్యూస్‌18’కు ఇచ్చిన ఇంటర్వ్యూ అనంత్‌లోని మానవీయతను వెల్లడిస్తుంది. నిలువెల్లా వినమ్రత, పలికే ప్రతి మాటలో నిజాయితీ అతని సొంతం. ఇంగ్లిష్‌లో కాదు... అందరికీ అర్థమయ్యేలా స్వచ్ఛమైన హిందీలో భావ వ్యక్తీకరణ అనంత్‌ ప్రత్యేకత. గాయపడిన, ఆదరణ కోల్పోయిన వన్యప్రాణులను అక్కున చేర్చుకుని వాటి సంరక్షణ కోసం జామ్‌నగర్‌లో మూడువేల ఎకరాల్లో ‘స్టార్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌ వన్‌తార’ అనే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. చిన్ననాడు తన నాయనమ్మ కోకిలా బెన్‌ నేర్పిన ప్రేమ, దయ భావనలే ఈ ప్రాజెక్టుకు తనను పురిగొల్పాయని చెప్పారు. తన ఆధ్వర్యంలోనే గుజరాత్‌ ప్రభుత్వ సహకారంతో ఒక ‘జూ’ కూడా నిర్వహిస్తున్నారు. 

‘ఇండియా టుడే’ ఛానెల్‌లో వచ్చిన ఇంటర్వ్యూ ఆయనలోని మరో మనిషిని ఆవిష్కరించింది. ఆ యువకుడిలో దాగున్న ఆధ్యాత్మిక భావనలూ, మాతృదేశంపై ఉన్న చెక్కుచెదరని మమకారాన్నీ ఆ ఇంటర్వ్యూ వెలికితీసింది. పెళ్లి వేడుకలు మన దేశంలోనే జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపే స్ఫూర్తిగా అందుకోసం జామ్‌నగర్‌ను ఎంచుకున్నానని చెప్పారు.

తన ఇంటిల్లిపాదికీ సనాతన ధర్మంపై ఉన్న భక్తి విశ్వాసాలనూ, వాటికి అనుగుణంగా ఆచరిస్తున్న విలువలనూ వివరించారు. ఆసియా ఖండంలోని సంపన్నవంతుల్లో మొట్టమొదటి స్థానంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్న కుటుంబంలో ఒక 28 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణతితో, ఆధ్యాత్మిక విలువలతో మాట్లాడతాడని బహుశా ఎవరూ అనుకుని ఉండరు. 

‘లైసెన్స్‌ రాజ్‌’గా పేరుబడిన ఆర్థిక సంస్కరణల పూర్వ దశలో అనంత్‌ తాత ధీరూభాయ్‌ అంబానీ తనదైన రీతిలో పావులు కదుపుతూ, ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ తన విశాల కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన వారసత్వాన్ని ముఖేష్‌ అప్రతిహతంగా కొనసాగిస్తూ దాన్ని మరింత పెంచుతున్న వైనమూ కళ్లముందే ఉంది. అందుకే ఇవాళ దేశంలో రిలయన్స్‌ స్పృశించని రంగమంటూ లేదు. ఆ కుటుంబ విలువలు సైతం అందరి హృదయాలనూ తాకుతాయని ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు తెలియజెప్పాయి.

బి.టి. గోవిందరెడ్డి 
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్టు 

Advertisement

తప్పక చదవండి

Advertisement