ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా చూడని వారు ఎవరూ ఉండరు. సోషల్ మీడియా వేదికను కొందరు కొత్త విషయాలను చెప్పడానికి వాడితే, మరికొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శించే వేదికగా వినియోగిస్తున్నారు. దేశాయ్ తల్లీ కూతుళ్లు మాత్రం.. వాళ్ల సృజనాత్మకతను వీడియోల రూపంలో పోస్టుచేసి ఎంచక్కా వ్యాపారం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతో బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తూ పోతున్నారు.
అది 2016. ముంబైలో ఉంటోన్న హీతల్ దేశాయ్ (తల్లి), లేఖినీ దేశాయ్ (కూతురు)లు ఇద్దరు హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్‌కు షాపింగ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ చేనేత వస్త్రాలను చూసిన వాళ్లకు ‘ చేనేత వస్త్రంతో వివిధ రకాల డిజైన్లతో డ్రెస్సులు అమ్మితే ఎలా ఉంటుంది? అనే బిజినెస్ ఐడియా వచ్చింది. అలా ఆలోచన రాగానే వెంటనే ఎగ్జిబిషన్‌లో సహజసిద్ధ రంగులతో తయారయ్యే అజ్రాఖ్ ప్రింట్ ఉన్న 50 మీటర్ల ఫ్యాబ్రిక్‌ను కొన్నారు. ఇంటికి వచ్చిన తరువాత ఆ వస్త్రాన్ని వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఒక టైలర్‌కు ఇచ్చి వివిధ రకాల సైజుల్లో కుర్తీ్తలను కుట్టించారు. వీటిని ఎలా విక్రయించాలా... అని ఆలోచించినప్పుడు లేఖినికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఫేస్‌బుక్ పేజీ ఒకటి క్రియేట్ చేసి ఆ కుర్తీల ఫోటోలను అందులో పోస్టు చేసింది. ఆ ఫోటోలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌కు నచ్చడంతో తమకు కావాలని అడిగారు. అలా రెండేళ్లపాటు సాగిన వ్యాపారం లో మంచి లాభాలు వస్తుండడంతో ‘ద ఇండియన్ ఎథినిక్ కోడాట్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో ఏడాదికి పాతిక లక్షల బిజినెస్ నడిచేది. ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతున్నారు.
బిజినెస్ ప్రారంభంలో లేఖిని ఎంబీఏ చదువుతూ మరోపక్క సోషల్ మీడియాలో మార్కెటింగ్‌ను నిర్వహించేది. ఎంబీఏ పూర్తయిన తరువాత కోల్‌కతాలోని ఐటీసీలో లేఖినీకి ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఫ్యామిలీ బిజినెస్‌లో కొనసాగాలా? కార్పొరేట్ కెరీర్‌ను ఎంచుకోవాలా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ఉద్యోగానికే ఓటేసింది. ఆ సమయంలో హీతల్ దేశాయ్.. కంప్యూటర్ నేర్చుకుని వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేసేవారు. వ్యాపారం మంచిగా సాగుతుండడంతో.. లేఖిని ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయిలో వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనేది.
ప్రస్తుతం ద ఇండియన్ ఎథినిక్ డాట్‌కు మూడు కార్యాలయాలతోపాటు, ఒక స్టూడియో ఉన్నాయి. మొదట్లో కుర్తీలతో ప్రారంభమైన దేశాయ్ వ్యాపారం క్రమంగా చేనేత చీరలను సరికొత్త డిజైన్లతో రూపొందించి, వాటిని వీడియోల రూపంలో మార్కెట్లో వదలడంతో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ చేనేత వస్త్రాల బ్రాండ్లలో ఇండియన్ ఎథినిక్ ఒకటిగా నిలవడం విశేషం.
లేఖినీ దేశాయ్ మాట్లాడుతూ...‘‘నా చిన్నప్పటినుంచి నాకు మా చెల్లికి ఏ డ్రెస్ అయినా అమ్మ మార్కెట్‌లో మెటిరియల్ కొని మాకు నప్పే విధంగా వివిధ రకాల డిజైన్లలో కుట్టేది. చిన్నప్పటి నుంచి అలా పెరిగిన నేను.. అమ్మ కుట్టే డ్రస్సులు మాకే కాదు అందరికి నచ్చుతాయి. వీటిని ఎవరైనా కొంటారు అనిపించేది. అలా అమ్మ కుట్టినవి కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి స్పందన వచ్చేది. ఈ రోజు పెట్టిన ఫోటోలు, వీడియోలలో ఉన్న చీరలు డ్రెస్‌లు మరుసటి రోజుకు అమ్ముడయ్యేవి. వేరే బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు మోడల్స్‌తో మోడలింగ్ చేయిస్తుంటారు. కానీ మేము అలాకాదు. మానాన్న గారి ప్రోత్సహంతో మేము డిజైన్ చేసిన బట్టలను వేసుకుని డ్యాన్స్ వేస్తూ మార్కెటింగ్ చేసేవారం. దీనికోసం గతేడాది ఒక స్టూడియో తీసుకున్నాం. దాన్లో నా ఫ్రెండ్స్ కొంతమందితో రూపొందించినlవస్త్రాలు కుట్టి పదినుంచి పదిహేను నిమిషాల వీడియోను షూట్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో కస్టమర్ల నుంచి లైక్‌లతోపాటు వేలాది ఆర్డర్లు వచ్చేవి. దీంతో ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందనిపించింది. ఇక అప్పటి నుంచి అలా కొనసాగిస్తున్నాము’’ అంటూ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పింది లేఖిని.
దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ!
Published Wed, Apr 21 2021 12:39 AM | Last Updated on Wed, Apr 21 2021 7:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment