చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్‌కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!
కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్‌ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.
ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్‌కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్‌సైజెస్ చేసి మరీ ఎక్స్‌పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్‌లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.
ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.
ఆథర్‌గా..
చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది!
Comments
Please login to add a commentAdd a comment