భారంగా రైతు వేదికల నిర్వహణ | Sakshi
Sakshi News home page

భారంగా రైతు వేదికల నిర్వహణ

Published Sun, May 5 2024 12:45 AM

భారంగా రైతు వేదికల నిర్వహణ

● నెలల తరబడి నిలిచిపోయిన చెల్లింపులు ● చేతి నుంచే ఖర్చు చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు ● వీసీల ఏర్పాటుతో పెరిగిన ఖర్చులు

బూర్గంపాడు: రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ శాఖ అధికారులకు భారంగా మారింది. వీటి నిర్వహణకు దాదాపు 20 నెలలుగా ప్రభుత్వం నుంచి పైసా కూడా రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు చేతి నుంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతు వేదికలను శుభ్రం చేసేందుకు నియమించిన స్వీపర్ల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, స్టేషనరీ ఖర్చులకు వేల రూపాయలు అవసరమవుతున్నాయి. వీటికి తోడు రైతులకు సాగులో మెళకువలను తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి వారం ఈ వేదికల నుంచే వ్యవసాయ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తోంది. ఈ ఖర్చులు కూడా రైతు వేదిక ఏఈఓలకు అదనపు భారంగా మారుతున్నాయి.

రైతులకు సహకారం అందించేలా..

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించే లక్ష్యంతో గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ప్రతి ఐదువేల ఎకరాల భూమి పరిధిని ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రూ.22 లక్షలతో ఒక రైతు వేదికను నిర్మించింది. దీని పర్యవేక్షణకు వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈఓ)ని నియమించింది. ఆ క్లస్టర్‌ పరిధిలోని రైతుల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు ఏఈఓను అందుబాటులో ఉంచారు. క్రాప్‌ బుకింగ్‌, రైతుబంధు, రైతు బీమా, పంటల సాగు, విత్తనాల సబ్సిడీ తదితర విషయాల్లో రైతులకు ఏఈఓలు సహకరిస్తారు. రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి తగు సూచనలు చేస్తుంటారు. ఇక రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ.9 వేల చొప్పున అందిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ గత 20 నెలలుగా నిధుల విడుదలలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది.

జిల్లాలో 67 వేదికలు..

జిల్లాలో 67 రైతు వేదికలు ఉన్నాయి. వీటి నిర్వహణకు నిధులు రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్‌ బిల్లులు, స్వీపర్ల వేతనాలు, స్టేషనరీ, తాగునీరు వంటి బిల్లులు కలిపి నెలకు రూ.10 వేల వరకు ఖర్చవుతుండగా.. ఏఈఓలే చెల్లిస్తున్నారు. ఇక వీడియో కాన్ఫరెన్స్‌లకు వచ్చే రైతులకు తాగునీరు, చాయ్‌, బిస్కట్లు కూడా వ్యవసాయ శాఖ అధికారులే ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఏఈఓలకు ఇది అదనపు భారంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతు వేదికల నిర్వహణకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని, పాత బకాయిలు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

రైతు వేదికల నిర్వహణకు సంబంధించి బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. రైతు వేదికల నిర్వహణ ఆర్థికంగా కొంత ఇబ్బందిగానే ఉంది. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ట్రెజరీ నుంచి నేరుగా అయా రైతు వేదికల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.

– అరుణ్‌బాబు, రైతు వేదికల జిల్లా ఇన్‌చార్జ్‌

Advertisement
 
Advertisement