పోలింగ్ రోజున మహిళా పోలీస్ అనూషపై టీడీపీ నేతల దాడి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటన
ఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
చివరికి కలెక్టర్ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు
రాజీకి ఒప్పుకోలేదని కౌంటర్ కేసూ నమోదు చేశారని బాధితురాలి ఆవేదన
దర్శి: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నాయకులకు వత్తాసు పలకడమే కాకుండా, కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేసిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం బూత్ నం.213లో మే 13న మహిళా పోలీస్ కట్టా అనూష బీఎల్‌వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారనే విషయమై వివాదం చెలరేగింది.
ఓటు వేసి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్న టీడీపీ నాయకులను ఓ కానిస్టేబుల్ వెళ్లిపోవాలని సూచించినా లెక్క చేయలేదు. అదే సమయంలో బీఎల్‌వో కల్పించుకుని మీరంతా ఇక్కడే ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెబుతుండగా టీడీపీ నాయకుడు జిల్లెళ్లమూడి రామకృష్ణ, మరో 12 మంది ఒక్కసారిగా రెచ్చిపోయారు. అనూషను అసభ్యకరంగా తిడుతూ జుట్టు పట్టుకుని లాగారు. గొంతు పట్టుకుని కింద పడేసి కొట్టారు. కులం పేరుతో తిడుతూ కాలితో తన్నబోతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్, బస్ డ్రైవర్ వచ్చి పక్కకు నెట్టినా ఆవేశంతో ఊగిపోయారు.
పట్టించుకున్నవారు లేరు..
తనపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మహిళా పోలీస్ అనూష మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి చెప్పగా, దర్శి సీఐ షమీఉల్లాను కలవాలని సూచించారు. ఆ రోజు సీఐ, ఎస్‌ఐకి విషయం చెప్పినా పట్టించుకోలేదు. 14న ఎస్‌ఐ సెలవులో ఉన్నారని చెప్పి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. 16న కేసు ఎందుకు కట్టలేదని ఏఎస్‌ఐని ప్రశ్నించగా ఉన్నతాధికారులను అడగాలని సమాధానమిచ్చారు.
కేసు నమోదు చేయాలని అనూష నిలదీయడంతో నిందితులుగా ఉన్న కోటేశ్వరరావు, మరి కొందరిని స్టేషన్‌కు పిలిపించారు. వారు ఏఎస్‌ఐ ఎదుటే మహిళా పోలీస్‌ను బెదిరించారు. కాగా, మే 17న దర్శి సీఐని కలిశానని, అయితే టీడీపీ నేతలను పిలిపించి రాజీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని అనూష చెబుతోంది. అదే రోజు మధ్యాహ్నం ఆమె ఒంగోలులో ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా.. ఎస్పీ ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కు పంపారు. 17న కలెక్టర్ దినేష్‌కుమార్ ఎదుట అనూష తన గోడు వెళ్లబోసుకున్నారు.
వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయానికి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముండ్లమూరు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు 13 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేరోజు బాధితురాలు అనూషపైనా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అట్రాసిటీ కేసుపై దర్శి డీఎస్పీ విచారణ చేపట్టినా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment