నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్
టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా కమిషన్ వ్యవహరిస్తోంది
మాచర్లలో అధికారులను మార్చిన తర్వాతే హింసాత్మక ఘటనలు
టీడీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నదని పిన్నెల్లి ముందే ఈసీకి లేఖ
రిగ్గింగ్ నిరోధించడంలో జిల్లా ఎస్పీ విఫలం
సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు.
పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమృకోటలో రిగ్గింగ్ జరుగుతోందని తానే ఫోన్ చేసి ఎస్పీకి తెలియచేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియమించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment