కోతి... కొబ్బరి కాయ! | Sakshi
Sakshi News home page

కోతి... కొబ్బరి కాయ!

Published Fri, Apr 19 2024 12:05 PM

thailand people training to monkeys for Picking Coconuts from trees - Sakshi

కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా?
అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా!
కానీ మీరోసారి థాయ్‌లాండ్‌, మరీ ముఖ్యంగా... 
దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి...
మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!!

విషయం ఏమిటంటే... థాయ్‌ల్యాండ్‌లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్‌. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్‌ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం.

థాయ్‌ల్యాండ్‌ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి.

నాణేనికి మరోవైపు...
కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్‌లాండ్‌ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ.

పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ అనిమల్స్‌) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. 

ఎగుమతులకు పెట్టింది పేరు...
థాయ్‌లాండ్‌ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్‌ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది.

కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్‌లాండ్‌ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా?

Advertisement
Advertisement