న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఖలీస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య చేసేందుకు ఓ భారతీయ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికపై అమెరికా స్పందించింది.
పన్నూ హత్య కుట్రకు సంబంధించిన ఆరోపణల దర్యాప్తులో తాము నిరంతరం భారత్‌తో టచ్‌లో ఉండి, ఈ వ్యవహారంపై పని చేస్తున్నామని అగ్రరాజ్యం అధికార ప్రతినిధి వేదాంత పటేల్ తెలిపారు.
‘పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విచారణపై పూర్తి జవాబుదారితనాన్ని ఆశిస్తున్నాం. అమెరికా.. భారత్‌తో ఈ విషయంలో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఈ కేసులో పురోగతి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మరింత సమాచారం తెలుసుకుంటున్నాం. పలు స్థాయిల్లో అమెరికా ఆందోళనను ప్రత్యేక్షంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. నేను ఈ విషయంలో మరింత జోక్యం చేసుకోలేను’ అని వేదాంత పటేల్ తెలిపారు.
ఇక.. వాషింగ్టన్ పోస్ట్ వెల్లండించిన నివేదికపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ భారత్ విదేశంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ అన్నారు.
ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి ప్రమేయం ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్‌గా గుర్తించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment