బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే.. | Sakshi
Sakshi News home page

బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..

Published Thu, Apr 11 2024 1:41 PM

Malaysian Beauty Queen Loses Crown After Video Goes Viral - Sakshi

ఒక్కోసారి ఆకాశాన్ని అందుకునే గొప్ప విజయాన్ని అందుకుంటాం. అందరిచేతే ఆహా ఓహో అనిపించుకుంటాం. ఇక్కడ గెలిస్తే సరిపోదు..ఆ విజయాన్ని నిలబెట్టుకునేలా మనం బిహేవ్‌ చేయాల్సి కూడా ఉంటుంది. లేదంటే ఈ బ్యూటీ క్వీన్‌లా అందరిముందే అబాసుపాలయ్యే గెలుపు కూడా నీరుగారిపోతుంది. 

అసలేం జరిగిందంటే..మలేషియాకు చెందిన అందాల భామ వీరూ నికా టెరిన్సిప్‌  2023లో ఉండక్‌ న్గడౌ జోహోర్‌ టైటిల్‌ని గెలుచుకుంది. అయితే ఆమె ఇటీవల సెలవులకు ధాయ్‌లాండ్‌లో గడపడానికి వెళ్లింది. అక్కడకు వెళ్లడమే శాపమై టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే..అక్కడ ఆమె కొంతమంది మగవాళ్లతో కలిసి కురచ దుస్తులు ధరించి డ్యాన్సులు చేసింది. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో వివాదాస్పదంగా మారి సదరు బ్యూటీ క్వీన్‌ విమర్శలపాలయ్యింది.  

ఈ వార్త కాస్త కడజాండుసున్‌ కల్చరల్‌ అసోసియేషన్‌కి చేరండంతో.. ఈ వీడియోపై సీరియస్‌ అవ్వుతూ ఆమె ఆ టైటిల్‌ను అందుకునే అర్హత లేదని స్పష్టం చేసింది. వెంటనే కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు సదరు కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ జోసెఫ్ పైరిన్ కిటింగన్ మాట్లాడుతూ..అందాల రాణి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏ మాత్ర సబబు కాదని అన్నారు. హుమినోడున్‌ రాష్ట్రానికి చెందిన అందాల రాణిగా టైటిల్‌ గెలుచుకుంది. అంటే.. ఆమె అపారమైన జ్ఞానానికి, సంస్కారానికి ప్రసిద్ధి అని అర్థం. పైగా పబ్లిక్‌ ఫిగర్‌. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది.

అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ పద్ధతిగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఇదేం అంత పెద్ద సమస్యగా ఉండేది కాదని కూడా కిటింగన్‌ అన్నారు. అంతేగాదు ఆమె తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లిందని మాకు అర్థమయ్యింది. కానీ ఇలాంటివి సహించేవి మాత్రం కావని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌ కాకుండా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు అయినా అందరికీ ఇదొక హెచ్చరికలా ఉంటుందన్నారు. మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు ఎ‍వ్వరూ యత్నించరని కిటింగన్‌ చెప్పారు.

ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా బ్యూటీ క్వీన్‌.. నా స్వంత ఇష్టంతోనే ఈ ఉండుక్‌  న్గడౌ అందాల పోటీలకు వెళ్లాను. అయినా ఈ టైటిల్‌ ఏమి ఒక వ్యక్తి పరిపూర్ణ విజయాన్ని నిర్ణయిస్తుందని భావించను. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి ఇచ్చేస్తాను ఈ టైటిల్‌ని. అలాగే ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగిందని ఒప్పుకుంటున్నా. అందుకు నన్ను క్షమించండి.  ప్రతి ఒక్కరూ  ఈ సంఘటనను నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నా.

అయినా ఈ విషయాన్ని భూతద్దంలా చూడొద్దు. దయచేసి ఇతర సమస్యలపై దృష్టిసారించండి. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీనికి నా స్నేహితులు, తల్లిదండ్రులను బాధ్యులుగా చెయ్యొద్దు. నా వివరణను యాక్సెప్ట్‌ చెయ్యడం, చెయ్యకపోవడం మీ ఇష్టం. గుండెల్లోంచి వస్తున్న మాటలు ఇవి. అయినా ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. అని పోస్ట్‌లో పేర్కొంది.  అందాల భామ వీరూ నికా టెరిన్సిప్‌.

(చదవండి: రంజాన్ రోజు షీర్‌ కుర్మా చేయడానికి రీజన్‌ ఏంటో తెలుసా..!)


 

Advertisement
Advertisement