ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల విద్యార్థుల ఘర్షణలు
భారీగా అరెస్టులు
లాస్‌ఏంజెలిస్: పాలస్తీనా–ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే.
హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్‌ఏంజెలెస్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్ హాల్‌లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు.
కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్‌కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు!
Comments
Please login to add a commentAdd a comment