‘మత రాజకీయాలు బీజేపీకే చెల్లుతాయి’ | Sakshi
Sakshi News home page

‘మత రాజకీయాలు బీజేపీకే చెల్లుతాయి’

Published Wed, Apr 17 2024 1:45 AM

రాజోళిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు  
 - Sakshi

రాజోళి: రామాలయం కట్టి ఓట్లు అడగడం బీజేపికే చెల్లుతుందని రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మత రాజకీయాలు అవసరం లేదన్నారు. మేధావి అనుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితతో కలిసి మాట్లాడారు. మండలంలో ఉన్న సమస్యలను మండల నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా కేసీఆర్‌ కుటుంబం మొత్తం వారి సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగారన్నారు. అందుకే కవిత ఇప్పుడు జైలులో ఉన్నారని, వారు చేసిన అవినీతి స్కాంలే వారిని జైలుకు పంపుతాయని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సారధ్యంలో చెప్పిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. అలంపూర్‌ నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ సాధించాలని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సంపత్‌ కుమార్‌ గెలిచినట్లైతే.. మంత్రి హోదాలో మీ ముందు ఉండేవాడని, గతంలో చేసిన తప్పు మళ్లీ చేసి అలంపూర్‌ అభివృద్ధిని కుంటుపడేలా చేయవద్దన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ మాట్లాడారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. నిత్యం ప్రజల్లో ఉంటానని, తనకు పదవులు లేకపోయినా, ఆది నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నానని తెలియజేశారు. రానున్న రోజుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌లోని రిజర్వాయర్లు, రాజోళి మండలానికి జూనియర్‌ కాలేజీ మంజూరుతో గ్రామాల అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం ఎంపీపీ మరియమ్మ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీని వదిలి 400 మంది దాకా కార్యకర్తలు పార్టీలో చేరారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మేధావి అనుకున్నా..

బీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రజలు చీదరించుకుంటున్నారు

రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement
Advertisement