ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి.
నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?
నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది.
సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.
ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్ 107/0)
లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)
ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.
ఒకే సీజన్‌లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.
ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)
100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్)
మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్‌రైజర్స్
ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్‌లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్‌లో సీఎస్‌కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment