Pitapuram: రాజ‘కీ’య యవనికపై పిఠాపురం | Sakshi
Sakshi News home page

Pitapuram: రాజ‘కీ’య యవనికపై పిఠాపురం

Published Tue, Apr 16 2024 2:35 AM

- - Sakshi

ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌ సీపీ

కుమ్ములాటల్లో విపక్ష కూటమి

టీ గ్లాసు బేజారు

చతికిలబడిన జనసేన

పిఠాపురం: చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగానే ఇప్పటి వరకూ ప్రపంచానికి పరిచయం ఉన్న పిఠాపురం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాంతంగా మారిపోయింది. ఏనోట విన్నా ఈ పట్టణం పేరే.. దేశ విదేశాల్లోనూ పిఠాపురం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. వైఎస్సార్‌ సీపీకి కంచుకోటగా ఉన్న పిఠాపురంలో.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో ఓడిపోయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గత్యంతరం లేని పరిస్థితుల్లో సామాజికవర్గ సమీకరణాలు కలసి వస్తాయనే ఆశతో ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పిఠాపురంలో ఫ్యాన్‌ జోరు హోరెత్తిస్తోంది. మరోవైపు కూటమి కుమ్ములాటలతో సతమతమవుతూ జనసేన చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం రాజకీయంగా కీలకంగా మారింది.

‘గీత’ దాటడం కష్టమే..
జిల్లా రాజకీయాల్లో కీలక మహిళా నేతగా.. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు సుపరిచితురాలైన కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పిఠాపురానికి సుపరిచితురాలు కావడం.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలుపుకొనిపోయే మనస్తత్వం కలిగి ఉండటం.. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండి పరిష్కారం చూపించడం ఆమెకు కలసి వచ్చే అంశాలు. ఇప్పటికే ఆమె జోరుగా ప్రచారం సాగిస్తూ ప్రజలతో విస్తృతంగా మమేకమవుతున్నారు.

ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదేనంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రత్యర్థి ఎంత గొప్పవాడైనా తన ముందు బలాదూర్‌ అనే రీతిలో గీత దూసుకుపోతూండటంతో వైఎస్సార్‌ సీపీ కేడర్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆమె ప్రచార శైలి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆమెను ఓడించడం ఎవరితరమూ కాదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె గెలుపు నల్లేరుపై నడకగానే ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వర్మ.. పవన్‌ ఖర్మ
విపక్షాలు ఒక్క కూటమిగా ఏర్పడితే వైఎస్సార్‌ సీపీని ఓడించడం సులభమవుతుందని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భావించారు. కానీ, అదే వారికి అశనిపాతమవుతోంది. దీనికి పిఠాపురమే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. పిఠాపురం సీటును టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తొలి నుంచీ ఆశించారు. అయితే, ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన పవన్‌.. వర్మ ఆశలపై నీళ్లు జల్లారు. దీనిపై మండిపడిన వర్మ, ఆయన వర్గీయులు టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను, చంద్రబాబు ఫొటోలను తగులబెట్టారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చంద్రబాబు, పవన్‌ రంగంలోకి దిగారు. బుజ్జగించారు.. బతిమాలారు.. చివరకు ఏం జరిగిందో ఏమో కానీ.. అంత హడావుడి చేసిన వర్మ.. కూల్‌గా మంగళగిరి వెళ్లి, పవన్‌ కల్యాణ్‌తో బొకే అందించి, చిరునవ్వులు చిందిస్తూ ఫొటో దిగారు. అనంతరం ఇక్కడకు ప్రచారానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌.. పోటీ చేసేది తాను కానీ, పెత్తనమంతా వర్మదేనని చెప్పడం ప్రజలను, జనసేన శ్రేణులను విస్మయానికి గురి చేసింది.

మరోవైపు పవన్‌తో సై అంటూనే.. ఆయన తరఫున టీడీపీ శ్రేణులు తనకు తెలియకుండా ప్రచారంలో పాల్గొనకుండా వర్మ అడ్డుపుల్ల వేస్తున్నారు. పిఠాపురం సీటు కోసం అంత రచ్చ చేసిన వర్మ కూడా.. సీటు జనసేనదైనా ప్రచారం, గెలుపు అన్నీ టీడీపీవేనని కుండ బద్దలుగొడుతున్నారు. పవన్‌ నెగ్గినా పాలన మాత్రం తనదేనంటున్నారు. పిఠాపురంలో అసలు జనసేన అనేదే లేదని, అంతా టీడీపీయేనని చెబుతున్నారు. జనసేన నేతలందరూ టీడీపీ నుంచి అమ్ముడుపోయిన వారేనని వర్మ పదేపదే బాహాటంగానే విమర్శిస్తున్నారు. వర్మ ఇంత చేస్తున్నా.. పవన్‌ కల్యాణ్‌ కానీ, జనసేన నేతలు కానీ నోరు మెదపడం లేదు. ఇదంతా చూస్తూంటే తమతో ఓట్లు వేయించి, అధికారాన్ని నిజంగానే టీడీపీకి అప్పగిస్తారేమోనని జనసేన నేతలు భావిస్తున్నారు. జనసేనకు ఓటు వేస్తే అది కచ్చితంగా చంద్రబాబుకు వేసినట్టేనని, వర్మ రాజకీయం పవన్‌ ఖర్మకొచ్చిందని కిందామీదా అవుతున్నారు.

దత్తపుత్రుడు దత్తాత్రేయ పుత్రుడవుతారా?
చంద్రబాబు పంచన చేరినప్పటి నుంచీ దత్తపుత్రుడుగా విమర్శలు ఎదుర్కొంటున్న పవన్‌.. ఇప్పుడు దత్తాత్రేయ పుత్రునిగా పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దత్తాత్రేయుని జన్మస్థలం పిఠాపురం కాబట్టి తాను ఆయన పుత్రుని(దత్తపుత్రుని)గా ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. అయితే విమర్శకులు మాత్రం.. దత్తపుత్రుడి పేరుకు సార్థకత చేకూరుస్తున్నారని చమత్కరిస్తున్నారు.

పదేళ్లుగా పట్టించుకోలేదేమిటో !
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ పిఠాపురం ఊసెత్తని పవన్‌.. ఇప్పుడు అంతా పిఠాపురమే అనడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన పదేళ్లలో ఏ ఒక్క రోజూ పిఠాపురం వంక కన్నెత్తి కూడా చూడని పవన్‌.. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుని, ఇక్కడ పోటీ చేస్తున్నట్టు తనంత తానుగా ప్రకటించేసుకున్నారు. కాపు నేతలనే వెంట తిప్పుకొంటు కేవలం కాపులే తనను గెలిపించేస్తారని బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఆయన తీరుపై ఇతర సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. ఏడాది నుంచి పిఠాపురం కోసం పావులు కదుపుతున్న పవన్‌.. ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న మాకినీడి శేషుకుమారిని మార్చి టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా, ఎటువంటి సంప్రదింపులూ లేకుండానే శేషుకుమారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. ఆ అవమానం భరించలేక ఆమె జనసేనకు గుడ్‌బై చెప్పి, వైఎస్సార్‌ సీపీలో చేరారు.

ముందుకు సాగని ప్రచారం
పిఠాపురంలో ఈ నెల మొదటి వారంలో నాలుగు రోజుల పాటు ప్రచారం చేస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఆ నాలుగు రోజులూ కూడా రోజుకు నాలుగు గంటలు మాత్రమే ఇక్కడ ప్రచారం చేసి, వెళ్లిపోయేవారు. ఆ క్రమంలో మహిళలతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఇక్కడ ప్రచారం చేసే నాథుడు లేక.. టీడీపీ నేత వర్మ నుంచి సహకారం లేక.. దిక్కుతోచని స్థితిలో జనసేన స్థానిక నేతలు కళ్లప్పగించి చూస్తున్నారు. బుల్లితెర నటుడు హైపర్‌ ఆది ఇక్కడ ప్రచారానికి తెర లేపగా.. ఆయన ఎందుకు వచ్చాడో తెలియని పరిస్థితి. ఇంకా నటులు వస్తారని చెప్పుకోవడం తప్ప నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రచారం ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితుల్లో పవన్‌ గెలుపు అంత ఈజీ కాదేమోనని జనసేన శ్రేణులు కలవరపడుతున్నాయి.

Advertisement
Advertisement