అదరగొట్టిన అమ్మాయిలు | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అమ్మాయిలు

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

‘పది’ ఫలితాల్లో బాలికలదే పైచేయి

83.09 ఉత్తీర్ణత శాతం నమోదు

గత ఏడాదితో పోల్చితే

మరింత పెరుగుదల

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గత నెల 18 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించిన టెన్త్‌ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 27,671 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 22,993 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 68.02 మాత్రమే కాగా, ఈ ఏడాది అది ఏకంగా 83.09 శాతానికి ఎగబాకడం విశేషం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయబావుటా ఎగురవేయడం గమనార్హం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు.

ప్రభుత్వ ప్రోత్సాహానికి ఫలితం

ప్రభుత్వ పాఠశాల అనగానే అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత అనే అభిప్రాయానికి ఈసారి విద్యార్థులు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. చాలీచాలని గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలు, కరువైన కనీస వసతుల వంటి సమస్యలకు గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. మన బడి నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారు. విద్యార్థులకు ఆసక్తి కలిగే రీతిలో బోధనలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు. కాలికి వేసుకునే బూట్ల నుంచి చదువుకునే పుస్తకాల వరకూ అన్నింటినీ విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్ది, ఉచితంగా అందించారు. ఫలితంగా ఈసారి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సర్కారీ బడుల విద్యార్థులు సగర్వంగా తలెత్తుకున్నారు. తగినన్ని వసతులు, శిక్షణ, ప్రోత్సాహం అందించాలే కానీ.. కార్పొరేట్‌ స్థాయి చదువులకు తాము ఎందులోనూ తీసిపోమని నిరూపించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈసారి అధిక సంఖ్యలో 500కు పైగా మార్కులు సాధించారు. పునర్విభజన అనంతరం ఏర్పడిన కొత్త జిల్లాల్లో రెండోసారి నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే కాకినాడ జిల్లా మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది.

ప్రణాళికాబద్ధంగా కృషి

ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు నమోదు చేయగలిగారు. జిల్లా విద్యాశాఖాధికారిగా పిల్లి రమేష్‌ గత ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ పదో తరగతి ఉత్తీర్ణత పెంపుపై దృష్టి కేంద్రీకరించారు. వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ నిర్ణయాలు అమలు తీరును పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పాఠశాలల తనిఖీలు చేపట్టారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల నుంచి ఆర్‌జేడీ స్థాయి వరకూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాల విద్య రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) నాగమణి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకత్వం చేశారు. అలాగే జిల్లా పరిషత్‌ తయారు చేసి, పంపిణీ చేసిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు. ఇటువంటి చర్యలన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేశాయని పలువురు హెచ్‌ఎంలు చెబుతున్నారు.

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో 4,678 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరితో పాటు మార్కులు తక్కు వగా వచ్చాయనే అనుమానం ఉన్నవారు పునఃమూల్యంకనం (రీ వెరిఫికేషన్‌) కోసం ఈ నెల 30వ తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సమష్టి విజయం

పదో తరగతి పరీక్షల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారుల సమష్టి కృషి కారణమైంది. విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అందుకనుగుణంగా బోధన చేపట్టాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు.

– పిల్లి రమేష్‌,

జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

జిల్లాలో టెన్త్‌ ఫలితాలు ఇలా..

పరీక్షలకు రాసిన వారు : 27,671

ఉత్తీర్ణులైన వారు : 22,993

ఉత్తీర్ణత శాతం : 83.09

ఫస్ట్‌ క్లాస్‌ : 18,039

సెకండ్‌ క్లాస్‌ : 3,479

థర్డ్‌ క్లాస్‌ : 1,475

పరీక్షలు రాసిన బాలికలు : 14,079

ఉత్తీర్ణులు : 12,035

బాలికల ఉత్తీర్ణత శాతం : 85.48

పరీక్షలు రాసిన బాలురు : 13,592

ఉత్తీర్ణులు : 10,958

బాలుర ఉత్తీర్ణత శాతం : 80.62

1/2

2/2

Advertisement
Advertisement