Sakshi News home page

పొలిటికల్‌ ఎంట్రీ తర్వాత విజయ్‌ ప్లాన్‌ ఇదేనా..?

Published Sun, Feb 4 2024 7:13 AM

Actor Vijay Next Political Plan - Sakshi

'తమిళగ వెట్రి కళగం' పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర పర్యటనపై దృష్టి పెట్టే విధంగా రూట్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వివరాలు.. దశాబ్ద కాలంగా రాజకీయ చర్చలు, వార్తలకు తెరదించుతూ రాజకీయ పార్టీని విజయ్‌ ప్రకటించేసిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం'గా నామకరణం చేసిన విజయ్‌ పార్టీలో 'ద్రావిడం' అన్న పదానికి చోటు కల్పించ లేదు. తమిళనాడులోని పార్టీల ముందు తప్పనిసరిగా ఆ పదం అనేది ఉంటూ వస్తోంది.

అయితే భిన్నంగా తమిళ ప్రజలు, తమిళనాడును ప్రతిబంబించే విధంగా 'తమిళగ వెట్రి కళగం' అన్న పేరు ప్రజలలోకి దూసుకెళ్లడం ఖాయం అని విజయ్‌ మద్దతుదారులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రకటన చేసిన విజయ్‌కు మక్కల్‌ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల్‌ ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసినట్టు సమాచారం. ఇక విజయ్‌కు సర్వత్రా శుభాకాంక్షలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో సైతం విజయ్‌ మంచివారని, గర్వం లేని వ్యక్తి అని పేర్కొంటూ, ఆయన రాకను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. విజయ్‌ రాకతో డీఎంకేకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎంపీ 'కనిమొళి' వ్యాఖ్యానించారు

ప్రజల్లోకి ఎంట్రీ ఎప్పుడంటే..
పార్టీ ప్రకటన తదుపరి ఇక మున్ముందు రాజకీయంగా కార్యాచరణను విస్తృతం చేయడానికి విజయ్‌ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను, బృందాలను రంగంలోకి దించబోతున్నారు. జిల్లాల కార్యదర్శులతో భేటీలను విస్తృతం చేయనున్నారు. ఇప్పటికే ఆనంద సాగరంలో మునిగి ఉన్న అభిమానులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా పార్టీ సభ్యత్వ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టబోతున్నారు. అలాగే పార్టీ జెండా, గుర్తును ప్రజలకు పరిచయం చేయడం, పార్టీ ఆవిర్భావ మహానాడుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ మహానాడు మదురై లేదా కడలూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి విజయ్‌ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు ఉంటాయని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా, సమాచారమైనా ఇకపై విజయ్‌ మాత్రమే ప్రకటిస్తారని విజయ్‌ మక్కల్‌ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్‌ పేర్కొన్నారు. విజయ్‌ ఎలాంటి సమాచారమైనా స్వయంగా ప్రకటిస్తారని, అంత వరకు వేచి ఉండాలని సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement