‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ | Ambajipeta Marriage Band 2024 Movie Review And Rating In Telugu | Suhas | Sharanya - Sakshi
Sakshi News home page

Ambajipeta Marriage Band Movie Review: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ

Published Fri, Feb 2 2024 8:34 AM

Ambajipeta Marriage Band Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
నటీనటులు:సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు 
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్
నిర్మాత: ధీరజ్‌మొగిలినేని
దర్శకత్వం: దుశ్యంత్‌ కటికనేని
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
ఎడిటర్‌: కోదాటి పవన్ కల్యాణ్
విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 2007లో సాగుతుంది.  అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లీ(సుహాస్‌), పద్మ(శరణ్య) కవలలు. మల్లీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో పని చేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుంది. తండ్రి కనకయ్య సెలూన్‌ షాప్‌ రన్‌ చేస్తుంటాడు. మల్లీకి ఆ ఊరిపెద్ద, ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వెంకట బాబు(నితిన్‌ ప్రసన్న) చెల్లెలు లక్ష్మీ(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం. లక్ష్మీకి కూడా మల్లీని ఇష్టపడుతుంది. వీరిద్దరు సెలూన్‌ షాప్‌నే అడ్డాగా మార్చుకొని రహస్యంగా ప్రేమించుకుంటారు. మరోవైపు వెంకట బాబు, పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకారు పుడుతుంది. పద్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తుంది.

ఓ సారి వెంకట బాబు తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్), మధ్య మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పద్మ శ్రీను చెంప పగలగొడుతుంది. అదే సమయంలో మల్లీ తన చెల్లితో ప్రేమలో ఉన్న విషయం వెంకట్‌కి తెలుస్తుంది. దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి రప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్‌. ఈ విషయం మల్లీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు వెంకటబాబు పద్మను ఏ రకంగా అవమానించాడు? పోలీసు స్టేషన్‌కి వెళ్లిన పద్మకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం కోసం పద్మ ఏం చేసింది? మల్లీకి వెంకట్‌ ఎందుకు గుండు గీశాడు? అక్క కోసం మల్లీ చేసిన పోరాటం ఏంటి?   చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
అంటరానితనం, కులవివక్ష నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ కూడా అదే. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్‌ స్టోరీనే అయినప్పటికీ  దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా..కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాను సరదాగా ప్రారంభించి.. ఎమోషనల్‌గా  ముగించాడు. 

తక్కువ కులానికి చెందిన హీరో..పెద్ద కులానికి చెందిన హీరోయిన్‌ని ప్రేమించడం అనే రొటీన్‌ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే లవ్‌స్టోరీ కొత్తగా అనిపించదు కానీ.. వినోదాన్ని మాత్రం అందిస్తుంది. ఇద్దరూ ప్రతి మంగళవారం సెలూన్‌ షాపులో కలుసుకోవడం.. ఫోన​్‌లో జరుపుకునే సంభాషణలు, మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్‌(జగదీష్‌) వేసే పంచులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది.

ఇంటర్వెల్ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉంటాయి. కొన్ని సీన్లు అయితే వాస్తవికానికి దూరంగా అనిపిస్తాయి. ‘ఆధారం లేని ఆక్రమణ సంబంధం ..అవమాన పడ్డ ఆత్మాభిమానం’ అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది. పోలీసు స్టేషన్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది.  కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి.  క్లైమాక్స్‌ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. 
షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన సుహాస్‌.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డిఫరెంట్‌ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లోనూ అదే చేశాడు. మల్లీగాడు పాత్రలో సుహాస్‌ ఒదిగిపోయాడు.  లవర్‌గా, అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్‌ సన్నీవేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక ఈ సినిమాలో సుహాస్‌ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది.  ఇన్నాళ్లు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లో డిఫరెంట్‌ పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించింది.

ఈ సినిమా చూసిన వాళ్లు పద్మ పాత్రను మరిచిపోలేరు. ఆ పాత్రలో అంత గొప్పగా నటించింది శరణ్య. ఆమె నటనకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడడం గ్యారెంటీ. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్‌ బంప్స్‌ తెప్పిస్తాయి.  లక్ష్మీగా శివానీ నాగారం తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగానూ కనిపించింది. విలన్‌గా నితిన్‌ ప్రసన్న అదరగొట్టేశాడు.  పుష్ప ఫేమ్‌ జగదీష్ మరోసారి తనదైన  నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, కిట్టయ్య, సురభితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం.  మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Rating:
Advertisement
Advertisement