ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం

Published Fri, Apr 19 2024 1:05 AM

ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన నాయకులు 
 - Sakshi

విజయం మీదే..

నంద్యాల(సిటీ): ‘పదేళ్లు జెండా మోసినా ప్రయోజనం లేదు. ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం. కనీసం పొత్తు ధర్మం పాటించని టీడీపీ వెంట నడవలేము’ అంటూ జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో నంద్యాలలో కూటమికి భారీ షాక్‌ తగిలింది. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్‌ కమిటీ స్టేట్‌ సెక్రటరీ, నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ విశ్వనాథ్‌తో పాటు ఆ పార్టీ నేతలు సాయి, అమర్‌నాథ్‌రెడ్డి, రాము, చాంద్‌ బాషా, అశోక్‌, షఫీలతో పాటు సుమారుగా 300 మంది గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్‌రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. నంద్యాల పట్టణ అభివృద్ధి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి టీడీపీ నాయకులు ఏమైనా చేసింది ఉందా.. అని ప్రశ్నించారు. కేవలం ఇతరులపై బురదజల్లే రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే వ్యాఖ్యలు సరికావన్నారు. గత సంవత్సరంలో 221 రోజుల పాటు నిత్యం ప్రతి గడపకూ వెళ్లి వారి కష్టసుఖాలను తాను తెలుసుకున్నానన్నారు. నంద్యాలను జిల్లా కేంద్రంగా, మెడికల్‌ కళాశాల, రోడ్లు, ఉర్దూ జూనియర్‌ కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి ఈ కొద్ది సంవత్సరాలలో జరిగిందన్నారు. టీడీపీ అభ్యర్థి ఫారూఖ్‌ వివిధ శాఖలలో పని చేసి నంద్యాలకు ఏం చేశారో చెప్పుకోగలరా అంటూ ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరిన నంద్యాల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ వారికి సేవ చేస్తున్న నాయకుని వెంట నడవడం కూడా హర్షించదగ్గ విషయమన్నారు. గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ జెండా మోసినా ఎలాంటి పొత్తు ధర్మం లేకుండా టీడీపీ నాయకులు తమపై చిన్న చూపు చూశారన్నారు. పార్టీ కోసం నిత్యం పని చేసినా సముచిత గౌరవం దక్కలేదన్నారు. కనీసం ప్రచారం చేద్దామని అడిగినా నంద్యాల టీడీపీ నాయకులు కనీసం తమకు ప్రాధాన్యత కల్పించలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకుడు శిల్పారవి వెంట నడవడమే ఉత్తమమని పార్టీని వీడి నేడు వైఎస్సార్‌సీపీలో చేరడం జరిగిందన్నారు. నాయకుడంటే ప్రజలలో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. తాను ఎలాంటి లబ్ధికోసం పార్టీలో చేరలేదన్నారు. యువతకు జగన్‌మోహన్‌రెడ్డి, ఇక్కడ శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఆదర్శమన్నారు. అనంతరం పలువురు జనసేన నాయకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాదరంగా వైఎస్సార్‌ కుటుంబంలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో పనిచేసే వారికి తప్పనిసరిగా సమాన గౌరవం ఉంటుందన్నారు.

డోన్‌లో గురువారం ఇంటింటి ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను మంత్రి వివరిస్తూ వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

జనసేనను వీడిన పార్టీ ప్రోగ్రామ్స్‌

కమిటీ స్టేట్‌ సెక్రటరీ

వైఎస్సార్‌సీపీలో చేరిన 300 మంది

జనసేన శ్రేణులు

సాదరంగా ఆహ్వానించిన

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి

1/2

2/2

Advertisement
Advertisement