బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే.. | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే..

Published Wed, Apr 17 2024 1:30 AM

-

నారాయణపేట: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చీకటి ఒప్పందంతో ఒక్కటైనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడుగురు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో నారాయణపేట పట్టణ, మండల, ఊట్కూర్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం జరిగిన జనజాతర సభలో బీఆర్‌ఎస్‌ను బీజేపీకి తాకట్టుపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని.. నారాయణపేటలో కాంగ్రెస్‌పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్థికి ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి తెరవెనుక మద్దతు తెలిపిన విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. పాలమూరులో సైతం కాంగ్రెస్‌ కు బీజేపీ మద్దతు తెలిపినందుకే ఈరోజు వారిని పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనమంతా మళ్లీ కేసీఆర్‌ వైపే చూస్తున్నారన్నారు.

నేను పక్కా లోకల్‌..

బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల అభ్యర్థులిద్దరూ స్థానికేతరులని.. తాను మాత్రం స్థానిక అభ్యర్థినని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే నాటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిపించారని.. ఇప్పుడు కూడా మరో అవకాశం ఇచ్చారని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని.. అదేవిధంగా ఎంపీగా మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు.

డీకే అరుణను ఓడిస్తా..

చిట్టెం నర్సిరెడ్డి కుమార్తెనంటూ చెప్పుకొంటున్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణను ఓడించి తీరుతామని మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు టీడీపీ నుంచి ఇదే పాలమూరు ఎంపీ టికెట్‌ ఇస్తే తన తండ్రి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించారని, ఇప్పుడు సైతం అదే జరుగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, ఊట్కూర్‌ జెడ్పీటీసీ అశోక్‌గౌడ్‌, పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, జిల్లా, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
Advertisement