Sakshi News home page

1984: రాజీవం

Published Sat, Apr 20 2024 4:25 AM

Lok sabha elections 2024: 8th lok sabha a historic victory congress party in 1984 - Sakshi

కాంగ్రెస్‌కు సానుభూతి పవనాలు

8వ లోక్‌సభ ఎన్నికల్లో 404 సీట్లు

ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్‌ 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. ఏకంగా 404 స్థానాల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలివి. ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డా సీట్లు మాత్రం రెండే దక్కాయి. అయితే ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ బలం క్రమంగా తగ్గుతూ పోగా, బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతూ రావడం విశేషం...

అభివృద్ధికి ప్రజామోదం  
1984 అక్టోబర్‌ 31న ఇందిర హత్య యావత్‌ ప్రపంచాన్నీ షాక్‌కు గురి చేసింది. అదే రోజు సాయంత్రం రాజీవ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఏడో లోక్‌సభ పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. 1984 డిసెంబర్‌ 24, 27, 28 తేదీల్లో 514 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న అసోం, పంజాబ్‌ల్లోని మిగతా స్థానాల్లో 1985లో ఎన్నికలు జరిగాయి.

సానుభూతికి తోడు ఇందిర దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. హరిత విప్లవంతో పంటల దిగుబడి భారీగా పెరిగింది. రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక నిర్ణయాలను జనం హర్షించారు. ఇందిర హయాంలోని 1980–85 ఆరో పంచవర్ష ప్రణాళికను అత్యంత విజయవంతమైనదిగా చెబుతారు.

జీవన వ్యయం పెరిగినా ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి చేరింది. వీటన్నింటి ఫలస్వరూపంగా కాంగ్రెస్‌కు ఏకంగా 49.1 శాతం ఓట్లు, 404 సీట్లు దక్కాయి. నెహ్రూ, ఇందిర నాయకత్వంలోనూ ఇన్ని సీట్లు రాలేదు. యూపీలో కాంగ్రెస్‌ 85కు ఏకంగా 83 సీట్లను గెలుచుకుంది! బెంగాల్‌ మినహా పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ దుమ్ము రేపినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎనీ్టఆర్‌ స్థాపించిన తెలుగుదేశం ధాటికి ఆరింటితోనే సరిపెట్టుకుంది. టీడీపీ ఏకంగా 30 సీట్లు నెగ్గింది.

బోఫోర్స్‌ మరక...
రాజీవ్‌ హయాంలో పలు వివాదాలూ రేగాయి. బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలులో అవినీతి మరక వాటిలో ముఖ్యమైనది. ఈ కాంట్రాక్ట్‌ కోసం గాను భారత రాజకీయ నాయకులకు బోఫోర్స్‌ కంపెనీ రూ.820 కోట్ల ముడుపులు చెల్లించినట్టు 1987 మేలో స్వీడిష్‌ రేడియో స్టేషన్‌ ప్రసారం చేసిన కథనం సంచలనం రేపింది. బోఫోర్స్‌ తరఫున మధ్యవర్తిత్వం వహించిన ఒట్టావియో ఖత్రోచికి రాజీవ్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే జాతుల పోరుతో అట్టుడుకుతున్న శ్రీలంకలో శాంతి పేరుతో జోక్యంపైనా రాజీవ్‌ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ పేరిట ఆయన పంపిన భారత సైన్యం ఎల్టీటీఈతో నేరుగా యుద్ధానికి దిగింది! ఈ పరిణామం అంతిమంగా రాజీవ్‌ హత్యకు దారితీసింది.

నాడేం జరిగిందంటే..?
ఇందిర హత్యకు గురైనప్పుడు రాజీవ్‌ పశి్చమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీకి తొలుత హత్య వార్త ఉదయం 9.30కు తెలిసింది. ఇందిరపై కాల్పులు జరిగాయని మాత్రం రాజీవ్‌కు చెప్పి విమానంలో ఢిల్లీ బయల్దేరదీశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లిన రాజీవ్‌ కాసేపటికి బయటికొచ్చి ‘అమ్మ మరణించింది’ అని ప్రకటించారు. అందరూ మౌనం దాల్చారు.  

మరిన్ని విశేషాలు...
► బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ 7.74 శాతం ఓట్లు సాధించింది.
► బీజేపీ నెగ్గిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ. అక్కడ బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ నరసింహారావును ఓడించారు. బీజేపీకి రెండో స్థానం గుజరాత్‌లోని మెహ్‌సానాలో దక్కింది.
► 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్‌ తీసుకొచ్చారు.
► ఓటు హక్కు వయో పరిమితిని 1988లో 21 ఏళ్ల నుంచి 18కి తగ్గించారు.
► ఎన్నికల్లో ఈవీఎంలు వాడేలా 1988లో చట్ట సవరణ చేశారు. సెబీని ఏర్పాటు చేశారు.
► 1989లో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి తోడు మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు.
► విద్య ఆధునికీకరణకు జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. నవోదయ విద్యాలయ వ్యవస్థ తెచ్చారు.
► కంప్యూటర్లు, విమానయాన పరిశ్రమ, రక్షణ, రైల్వేల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు.
► వృద్ధి రేటు పెంపే లక్ష్యంగా కొర్పొరేట్‌ సంస్థలకు సబ్సిడీలు అందించారు.
► దేశంలో టెలికం, ఐటీ రంగ అభివృద్ధికి రాజీవే ఆద్యుడని చెబుతారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement