ఆ ఈవీఎంల వినియోగానికి హైకోర్టు ఓకే | Sakshi
Sakshi News home page

ఆ ఈవీఎంల వినియోగానికి హైకోర్టు ఓకే

Published Thu, May 2 2024 4:36 AM

EVMs for Medchal Assembly Elections

మేడ్చల్‌ అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంలు.. లోక్‌సభ ఎన్నికల్లో వాడుకునేందుకు ఈసీకి అనుమతి

మల్లారెడ్డి ఎన్నికను సవాల్‌ చేస్తూ వజ్రేష్‌యాదవ్‌ పిటిషన్‌

 విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో వాడుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున మల్లారెడ్డి, కాంగ్రెస్‌ తరఫున వజ్రేష్‌యాదవ్‌ పోటీ చేశారు. 

33 వేల మెజారిటీతో మల్లారెడ్డి విజయం సాధించారు. అయితే అఫిడవిట్‌లో మల్లారెడ్డి తప్పుడు సమాచా రం ఇచ్చారని.. నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలన్నీ ఇవ్వలేదని ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వజ్రేష్‌ యాదవ్‌ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. సమీప అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఎన్నికల కమిష న్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 వజ్రేష్‌ తరఫున న్యాయవాది సిర్థ పోగుల దాఖలు చేసిన పిటిష న్‌పై జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. ఎన్నికల కమిషన్, మేడ్చేల్‌ ఆర్డీవో, అసెంబ్లీ కార్యదర్శి, మల్లారెడ్డితో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు కారణంగా గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేయగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నోటీసులు
జనగామ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) ఎన్నికను సవాల్‌ చేస్తూ కొమ్మూరి ప్రతాపరెడ్డి(కాంగ్రెస్‌) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమీప ప్రత్యర్థినైన తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ పిటిషన్‌పై కూడా న్యాయమూర్తి జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. వాదన తర్వాత.. రాజేశ్వర్‌రెడ్డి సహా ఇతర ప్రతివా దులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూన్‌ 14కు వాయిదా వేశారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement