ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.
క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్‌రైజర్స్‌ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్‌లు ఇదే సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్‌లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్‌రైజర్స్‌పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.
సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఫామ్‌లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు.
ప్లే ఆఫ్స్‌లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్‌కు ప్లే ఆఫ్స్‌లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్‌లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.
ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment