వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

Mudragada: సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

Published Fri, Mar 15 2024 10:40 AM

Mudragada Padmanabham Join YSRCP In CM Jagan Presence - Sakshi

గుంటూరు, సాక్షి:  సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.  ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు.

గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఏపీలో తీవ్రంగా నడిచింది. అయితే.. సీఎం జగన్‌ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని భావించిన ముద్రగడ చివరకు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారు. ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (కాకినాడ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు. కాపు ఉద్యమ నేతగా ఆయన పోరాటం తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే.


వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి
శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. శ్రీనివాసులు 2011, 2017లో ఈస్ట్‌ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మురళీధర్, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి, డాక్టర్‌ జగదీశ్వర్‌ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement