Telangana Crime News: విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!
Sakshi News home page

విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!

Published Mon, Sep 11 2023 6:44 AM

- - Sakshi

మెదక్‌: నార్సింగి మండలం జప్తి శివునూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ అహ్మద్‌ మోహినుద్దీన్‌ తెలిపిన వివరాలు. నిజాంపేట మండలం నార్లాపూర్‌ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పెంటపర్తి బాపురెడ్డి కుమారుని వివాహం ఇటీవలే జరిగింది. ఈమేరకు ఆదివారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్‌ హాలులో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

బాపురెడ్డి తన బావ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్‌పేటకు చెందిన సిరికొండ లింగారెడ్డి, తోడల్లుడు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ముత్యాల వెంకట్‌రాంరెడ్డితో కలిసి కారులో జంగరాయి నుంచి రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో జప్తి శివునూర్‌వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్‌రాంరెడ్డి (55) అక్కడిక్కడే మృతిచెందగా, లింగారెడ్డి (48) రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడిన బాపురెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ ప్రమాదాలకు గురైన వాహానాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌ క్లియక్‌ చేయించారు. ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ప్రమాదంలో మృతిచెందిన లింగారెడ్డి బీఆర్‌ఎస్‌ అంబర్‌పేట గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement