బీటీ రోడ్డు నిర్మాణం కలేనా? | Sakshi
Sakshi News home page

బీటీ రోడ్డు నిర్మాణం కలేనా?

Published Tue, Apr 16 2024 6:45 AM

అంతక్కపేట గ్రామం నుంచి చిన్నగుబ్బడి వరకు వెళ్లే మట్టిరోడ్డు - Sakshi

● నరకప్రాయంగా చిన్నగుబ్బడి మట్టిరోడ్డు ● రూ.1.50కోట్లతో బీటీ రోడ్డు మంజూరు ● శంకుస్థాపనకే పరిమితం: స్థానికులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామ పరిధిలోని చిన్నగుబ్బడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయోనని స్థానికులు, వాహనదారులు ఎదురుచూస్తున్నారు. బీటీ రోడ్డు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా పనులు ప్రారంభించకపోవడం ఏమిటని వాపోతున్నారు. ఈ బిటీ రోడ్డు నిర్మాణ పనులకు జనవరి 29న మంత్రి పొన్నం ప్రభాకర్‌ శంకుస్థాపన చేశారు. అంతక్కపేట గ్రామం నుంచి చిన్నగుబ్బడి వరకు దాదాపు 2కిలో మీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డుకు రూ.1.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే రెండు నెలలు దాటుతున్నా కాంట్రాక్టర్‌ మాత్రం పనులు ప్రారంభించలేదు.

ప్రయాణం.. నరకప్రాయం

ప్రస్తుతం ఉన్న మట్టిరోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రోడ్డంతా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షాలు కురిస్తే చాలు రోడ్డు బురదమయంగా మారుతుందని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. రాత్రిపూట గుంతలు కనబడక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బీటీ రోడ్డు నిర్మించి ఇబ్బందులు తీర్చాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని చిన్నగుబ్బడి ప్రజలు అంటున్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్‌ పనులు చేయడం లేదు

బీటీ రోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట మంత్రి పొన్నం ప్రభాకర్‌ శంకుస్థాపన చేశారు. కానీ సదరు కాంట్రాక్టర్‌ పనులు చేయడం లేదు. వేరేచోట రోడ్డు పనులు జరుగుతున్నాయని చెబుతున్నాడు. టెండర్‌ ప్రకారం ఏడాదిలోపు బీటీ రోడ్డు పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేస్తాం. త్వరలో రోడ్డు పనులు ప్రారంభించేలా చూస్తాం.

– స్నేహ, ఏఈ పంచాయతీరాజ్‌,

అక్కన్నపేట మండలం

మంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకం
1/2

మంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకం

2/2

Advertisement
Advertisement