Reasons Behind Anderson And Bumrah Fight Revealed By Coach R Sridhar - Sakshi
Sakshi News home page

Bumrah Anderson Fight: బుమ్రా ఇది చీటింగ్‌.. ఇంత ఫాస్ట్‌ బౌలింగ్‌ ఏంటి?

Published Fri, Aug 20 2021 8:45 PM

Anderson Complained To Bumrah Over speed, Said This Is Cheating: R Sridhar - Sakshi

లండన్‌: ఆతిధ్య ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసు గుర్రం బుమ్రా, ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ ఆండర్సన్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచి, ఆతర్వాత పలు వివాదాలకు కూడా దారి తీసింది. అయితే, వారిద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందన్న విషయాన్ని భారత ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్‌ మాట్లాడుతూ.. లార్డ్స్‌ టెస్ట్‌ మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా ప్రమాదక వేగంతో బౌలింగ్‌ చేశాడని, దీంతో బెంబేలెత్తిపోయిన ఆండర్సన్‌.. బుమ్రా నువ్వు చీటింగ్‌ చేస్తున్నావు.. ఎప్పుడూ లేనిది ఇంత ఫాస్ట్‌ బౌలింగ్‌ ఏంటని ప్రశ్నించాడని, అక్కడి నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైందని అసలు విషయాన్ని రివీల్‌ చేశాడు.

బుమ్రా కెరీర్‌ ఆరంభం నుంచి 80 నుంచి 85 మైళ్ల వేగంతో బౌలింగ్‌ చేశాడని, అయితే ఆ మ్యాచ్‌లో ఆండర్సన్‌కు బౌలింగ్‌ చేసేటప్పుడు బుమ్రా ఏకంగా 90 మైళ్ల వేగంతో బంతులను సంధించడంతో ఆండర్సన్‌ దడుసుకున్నాడని శ్రీధర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌లో బుమ్రా భీకరమైన వేగంతో సంధించిన బంతుల ధాటికి ఆండర్సన్‌ పలు మార్లు గాయపడ్డాడు. ఆతర్వాత భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆండర్సన్‌ కూడా బుమ్రాను భౌతికంగా టార్గెట్‌ చేస్తూ బౌలింగ్‌ చేసినప్పటికీ అతని పాచిక పారలేదు. ఫలితంగా షమీ సహకారంతో బుమ్రా 9వ వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు.
చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్‌ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Advertisement
Advertisement