అన్ని వర్గాల పట్టభద్రులతో ప్రత్యేక భేటీలు
బూత్ స్థాయిలో ప్రతీ ఓటరును కలుద్దాం.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో సమావేశాలు
బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుమార్లు పార్టీ అభ్యర్థులే విజయం సాధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముమ్మర ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ప్రచారానికి కేవలం పది రోజులే ఉన్నందున సర్వశక్తులొడ్డి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి వరకు ప్రచారం జరిగేలా సంబంధిత నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలన్నారు. బూత్‌ల వారీగా ఇన్‌చార్జీలను నియమించి ప్రచారం సమన్వయం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సింగరేణి–ఆర్టీసీ సంస్థల కార్మికులు, మహిళలు, యువత తదితర వర్గాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అవసరమైన చోట తనతోపాటు హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. ముఖ్య నేతల ప్రచారానికి వీలుగా షెడ్యూల్ సిద్ధం చేయాలని, పార్టీ యంత్రాంగాన్ని ప్రచారంలో నిమగ్నమయ్యే లా చూడాలని కేటీఆర్ ఆదేశించారు.
అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి!
ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్‌ఎస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, నల్లగొండ నుంచి జగదీశ్‌రెడ్డి, వరంగల్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సుమారు 130 మంది నేతలకు ఆహ్వానం పంపగా, 60 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బసవరాజు సారయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరు కాలేదు. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు కూడా రాలేదు. అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే పలువురు సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్‌తో ఎంపీ అభ్యర్థుల భేటీ
రెండు రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసిన పలువురు బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ నియోజక వర్గాల వారీగా పోలింగ్ సరళిపై చర్చించారు. మెజారిటీ స్థానాల్లో త్రిముఖ పోటీ బీఆర్‌ఎస్ కు అనుకూలిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నా యని కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా ఫలితాల తర్వాత జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపైనా చర్చించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో నామా నాగేశ్వర్ రావు, మాలోత్ కవిత, డాక్టర్ సుధీర్‌కుమార్, క్యామ మల్లేశ్, కంచర్ల కృష్ణారెడ్డి, పద్మారావు గౌడ్, కొప్పుల ఈశ్వర్, గడ్డం శ్రీనివాస్ యాద వ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment