IPL 2024 DC Vs GT: ప్రచండ పంత్‌... | Sakshi
Sakshi News home page

IPL 2024 DC Vs GT: ప్రచండ పంత్‌...

Published Thu, Apr 25 2024 4:47 PM

Crucial win for Delhi Capitals - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక విజయం

రాణించిన అక్షర్‌ పటేల్, కుల్దీప్‌

4 పరుగులతో ఓడిన గుజరాత్‌

సుదర్శన్, మిల్లర్‌ మెరుపులు వృథా  

ఐపీఎల్‌లో మరో మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌  నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని కూడా గుజరాత్‌ టైటాన్స్‌ ఛేదించేలా కనిపించింది. అయితే చివరకు క్యాపిటల్స్‌దే పైచేయి కాగా... టోర్నీలో మ్యాచ్‌ మ్యాచ్‌కూ పదునెక్కుతున్న బ్యాటింగ్‌తో రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడటం ఈ పోరులో హైలైట్‌గా నిలిచింది.   

న్యూఢిల్లీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని అందుకొని ఊపిరి పీల్చుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిషభ్‌ పంత్‌ (43 బంతుల్లో 88 నాటౌట్‌; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 113 పరుగులు జోడించడం విశేషం. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసి ఓడిపోయింది. సాయి సుదర్శన్‌ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (23  బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

భారీ భాగస్వామ్యం... 
జేక్‌ ఫ్రేజర్‌ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి దూకుడైన ఆటతో ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే 9 పరుగుల వ్యవధిలో ఫ్రేజర్‌తో పాటు పృథ్వీ షా (11), షై హోప్‌ (5) వెనుదిరిగారు. మూడో స్థానానికి ప్రమోట్‌ అయిన అక్షర్‌ దూకుడైన షాట్లతో ఆకట్టుకోగా, ఆ తర్వాత పంత్‌ తన జోరు ప్రదర్శించాడు. 37 బంతుల్లో అక్షర్‌ అర్ధసెంచరీ పూర్తయింది.

నూర్‌ అహ్మద్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అక్షర్‌ తర్వాతి బంతిని అదే తరహాలో ఆడే ప్రయత్నంలో వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో సిక్స్‌తో 34 బంతుల్లో పంత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. సాయికిశోర్‌ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్‌ వరుసగా 4, 6, 4, 6 బాదడంతో చెలరేగడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి.  

సుదర్శన్‌ అర్ధసెంచరీ... 
భారీ ఛేదనలో ఆరంభంలోనే గుజరాత్‌ కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (6) వెనుదిరిగినా... సాహా, సాయి సుదర్శన్‌ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరు 49 బంతుల్లోనే 82 పరుగులు జత చేశారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్‌ యాదవ్‌ విడదీసిన తర్వాత టైటాన్స్‌ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిల్లర్‌ కొన్ని మెరుపు షాట్లు ఆడటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.

నోర్జే ఓవర్లో అతను 3 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు. అయితే అతను వెనుదిరిగాక గుజరాత్‌ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. చివరి ఓవర్లో గుజరాత్‌ విజయానికి 19 పరుగులు అవసరంకాగా... ముకేశ్‌ వేసిన ఈ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ 16 పరుగులే సాధించడంతో టైటాన్స్‌ ఓటమి ఖరారైంది. 

ఒకే ఓవర్లో 31 పరుగులు 
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసేసరికే దూకుడు పెంచిన పంత్‌ చివరి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. మోహిత్‌ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి  బంతికి 2 పరుగులు రాగా, తర్వాతి బంతి వైడ్‌ అయింది.

అయితే ఆ తర్వాత పంత్‌ వరుసగా 6, 4, 6, 6, 6తో తన సత్తా చూపాడు. దాంతో ఈ ఓవర్లో ఏకంగా  31 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బకు మోహిత్‌ శర్మ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (4 ఓవర్లలో 73) ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో బాసిల్‌ థంపి (70) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. మోహిత్‌ 7 సిక్స్‌లు ఇవ్వగా అన్నీ పంత్‌ కొట్టినవే!  

స్కోరు వివరాలు  
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) నూర్‌ (బి) సందీప్‌ 11; జేక్‌ ఫ్రేజర్‌ (సి) నూర్‌ (బి) సందీప్‌ 23; అక్షర్‌ (సి) సాయికిశోర్‌ (బి) నూర్‌ 66; హోప్‌ (సి) రషీద్‌ (బి) సందీప్‌ 5; పంత్‌ (నాటౌట్‌) 88; స్టబ్స్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–35, 2–36, 3–44, 4–157. బౌలింగ్‌: అజ్మతుల్లా 4–0–33–0, సందీప్‌ వారియర్‌ 3–0–15–3, రషీద్‌ ఖాన్‌ 4–0–35–0, నూర్‌ అహ్మద్‌ 3–0–36–1, మోహిత్‌ శర్మ 4–0–73–0, షారుఖ్‌ ఖాన్‌ 1–0–8–0, సాయికిశోర్‌ 1–0–22–0.  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 39; గిల్‌ (సి) అక్షర్‌ (బి) నోర్జే 6; సుదర్శన్‌ (సి) అక్షర్‌ (బి) సలామ్‌ 65; అజ్మతుల్లా (సి) ఫ్రేజర్‌ (బి) అక్షర్‌ 1; మిల్లర్‌ (సి) సలామ్‌ (బి) ముకేశ్‌ 55; షారుఖ్‌ (సి) పంత్‌ (బి) సలామ్‌ 8; తెవాటియా (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 4; రషీద్‌ (నాటౌట్‌) 21; సాయికిశోర్‌ (బి) సలామ్‌ 13; మోహిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–13, 2–95, 3–98, 4–121, 5–139, 6–152, 7–181, 8–206. బౌలింగ్‌: ఖలీల్‌ 2–0–26–0, నోర్జే 3–0–48–1, సలామ్‌ 4–0–44–3, ముకేశ్‌ 4–0–41–1, అక్షర్‌ 3–0–28–1, కుల్దీప్‌ 4–0–29–2. 

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్‌ X బెంగళూరు 
వేదిక: హైదరాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

తప్పక చదవండి

Advertisement