Deodhar Trophy 2023: Riyan Parag Hits 84-Ball Hundred, Smashes Record 11 Sixes; Fans Reacts - Sakshi
Sakshi News home page

Riyan Parag: సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్‌ పరాగ్ విధ్వంసం! ఊహించలేదు..

Published Fri, Jul 28 2023 8:15 PM

Deodhar Trophy All Round Riyan Parag Century Powers East Zone To Win Fans Reacts - Sakshi

Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్‌ ట్రోఫీ-2023లో ఈస్ట్‌ జోన్‌ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. నార్త్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌- ఈస్ట్‌ జోన్‌ తలపడ్డాయి.

టాస్‌ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్‌లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌(10), ఉత్కర్ష్‌ సింగ్‌(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ సింగ్‌ కేవలం 2 పరుగులు చేశాడు.

రియాన్‌ పరాగ్‌ సిక్సర్ల వర్షం 
ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్‌ సౌరభ్‌ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్‌ పరాగ్‌ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.

అద్భుత సెంచరీ
102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్‌ జోన్‌ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్‌ జోన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను రియాన్‌ పరాగ్‌ కకావికలం చేశాడు.

నాలుగు వికెట్లు తీసి
10 ఓవర్ల బౌలింగ్‌లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్‌, ఆకాశ్‌ దీప్‌, ముఖ్తార్‌ హుసేన్‌ తలా ఓ వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్‌ జోన్‌ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్‌ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్‌జోన్‌ జయభేరి మోగించింది.

అస్సలు ఊహించలేదు.. 
ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్‌ పరాగ్‌ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్‌ ప్లేయర్‌గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్‌ దియోదర్‌ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం.

చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. 

Advertisement
Advertisement