WC 2023: ‘సిక్సర్‌’ వేటలో టీమిండియా.. అశ్విన్‌కు చాన్స్‌! | Sakshi
Sakshi News home page

WC 2023: ‘సిక్సర్‌’ వేటలో టీమిండియా.. అశ్విన్‌కు చాన్స్‌!

Published Sun, Oct 29 2023 3:55 AM

India World Cup match with England today - Sakshi

లక్నో: భారత్‌కు చెలగాటం...ఇంగ్లండ్‌కు ప్రాణసంకటం...ప్రపంచ కప్‌ పోరులో నేడు సరిగ్గా ఇదే పరిస్థితి కనిపించనుంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచి సిక్సర్‌పై (ఆరో విజయం)పై దృష్టి పెట్టిన టీమిండియా ఒక వైపు... నాలుగు మ్యాచ్‌లు ఓడి మరొకటి ఓడితే లీగ్‌ దశలోనే నిష్క్రమించే అవకాశం ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ మరో వైపు...ఆదివారం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

ఏక్నా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. ఫామ్, బలాబలాలు చూస్తే ఇంగ్లండ్‌కంటే అన్ని విధాలా భారత్‌దే పైచేయి కాగా, పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న బట్లర్‌ బృందం ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. 

అశ్విన్‌కు చాన్స్‌! 
జోరు మీదున్న భారత జట్టులో ఎవరి గురించి ఆందోళన లేదు. రోహిత్‌ అద్భుతమైన ఆరంభం అందిస్తుండగా, గిల్, కోహ్లి దానిని కొనసాగిస్తున్నారు. అయ్యర్, రాహుల్‌ల ఆటతో టీమ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కూ పాండ్యా దూరమైనా సూర్యకుమార్‌ తనకు లభించిన మరో అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు అజేయంగా ఉన్న టీమ్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

బౌలింగ్‌లో పదునైన దళం భారత్‌కు ఉంది. బుమ్రాను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోగా, తానేంటో షమీ గత మ్యాచ్‌లోనే చూపించాడు. జడేజాతో పాటు సొంతగడ్డపై ఆడనున్న కుల్దీప్‌ ప్రభావం చూపించగలరు. లక్నో మొదటినుంచీ స్పిన్‌కు కాస్త అనుకూలమైన పిచ్‌ కాబట్టి సిరాజ్‌ స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశాన్ని మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది.  

గెలిపించేదెవరు?  
గత చాంపియన్‌ ఇంగ్లండ్‌ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. ఐదు మ్యాచ్‌లు ఆడినా జట్టులో ఒక్క ప్లేయర్‌ కూడా ఆశించిన రీతిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా బట్లర్, రూట్, బెయిర్‌స్టో వరుసగా విఫలమయ్యారు. అందుబాటులో ఉన్న 15 మందిని మార్చి మార్చి ఇంగ్లండ్‌ ఇప్పటికే ప్రయత్నించింది కానీ ఫలితం దక్కలేదు.

ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి బౌలింగ్‌ ఆల్‌రౌండర్లనే ఆ జట్టు నమ్ముకుంటోంది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే మాత్రం జట్టు కుప్పకూలడం ఖాయం. బౌలింగ్‌లో కూడా ఆ జట్టు బాగా బలహీనంగా ఉంది. వోక్స్, విల్లీ, అట్కిన్సన్‌లాంటి వాళ్లు భారత్‌పై ప్రభావం చూపించడం 
సందేహమే.  

పిచ్, వాతావరణం  
ఐపీఎల్‌నుంచీ ఇది స్పిన్నర్ల పిచ్‌. సీమర్లు ఆరంభంలో మాత్రం కాస్త ప్రభావం చూపగలరు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటే పరుగులు రాబట్టవచ్చు. మ్యాచ్‌కు వర్షసూచన లేదు.  

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్‌/అశ్విన్‌.  
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్ ), బెయిర్‌స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్‌.  

Advertisement
Advertisement