LSG Vs KKR: సూపర్‌ సాల్ట్‌... | IPL 2024 LSG Vs KKR: Kolkata Knight Riders Beat Lucknow Super Giants By 8 Wickets, Check Full Score Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG Vs KKR Highlights: సూపర్‌ సాల్ట్‌...

Published Mon, Apr 15 2024 2:42 AM

Kolkata won by 8 wickets against Lucknow - Sakshi

47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 నాటౌట్‌

లక్నోపై 8 వికెట్లతో కోల్‌కతా ఘనవిజయం

కోల్‌కతా: మిచెల్‌ స్టార్క్‌ (3/28) నిప్పులు చెరిగే బౌలింగ్‌... ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (47 బంతుల్లో 89 నాటౌట్‌; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు... వెరసి ఐపీఎల్‌లో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) అలవోక విజయంతో మళ్లీ గెలుపుబాట పట్టింది.

ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ బృందం 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఒక్క కెప్టెన్ రాహుల్‌ (27 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే మెరుగ్గా ఆడాడు.

డికాక్‌ (10) ఇంపాక్ట్, వన్‌డౌన్‌లో దీపక్‌ హుడా (8) ను దించిన ఎత్తుగడలేవీ ఫలించలేదు. స్టొయినిస్‌ (10) కూడా నిరాశపరిచాడు. ఆయుశ్‌ బదోని (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), నికోలస్‌ పూరన్‌ (32 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు చేసిన పరుగులతో లక్నో 150 పైచిలుకు స్కోరు చేసింది. బ్యాట్‌తో చెలరేగిపోతున్న సునీల్‌ నరైన్‌ (4–0– 17–1) బంతితో లక్నోను కట్టిపడేశాడు.

అనంతరం కోల్‌కతా 15.4 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. అయితే లక్ష్యఛేదనకు దిగగానే కోల్‌కతాను మోసిన్‌ కష్టాల్లో పడేశాడు. ఓపెనర్‌ నరైన్‌ (6), రఘువంశీ (7)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 42/2 మాత్రమే! ఈ దశలో ఓపెనర్‌ సాల్ట్,  అయ్యర్‌ లక్నో బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బ్యాటింగ్‌ కొనసాగించారు.

మరో వికెట్‌ తీసే అవకాశమే ఇవ్వకుండా అబేధ్యమైన మూడో వికెట్‌కు 120 పరుగుల్ని వేగంగా జతచేయడంతో నైట్‌రైడర్స్‌ 16వ ఓవర్‌ పూర్తవకముందే గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సాల్ట్‌ 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.   

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) నరైన్‌ (బి) వైభవ్‌ 10; రాహుల్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రసెల్‌ 39; హుడా (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 8; బదోని (సి) రఘువంశీ (బి) నరైన్‌ 29; స్టొయినిస్‌ (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 10; పూరన్‌ (సి) సాల్ట్‌ (బి) స్టార్క్‌ 45; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 7; అర్షద్‌ ఖాన్‌ (బి) స్టార్క్‌ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–19, 2–39, 3–78, 4–95, 5–111, 6–155, 7–161. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–28–3, వైభవ్‌ 3–0–34–1, హర్షిత్‌ 4–0–35–0, సునీల్‌ నరైన్‌ 4–0–17–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–30–1, రసెల్‌ 1–0–16–1. 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: ఫిల్‌ సాల్ట్‌ (నాటౌట్‌) 89; నరైన్‌ (సి) స్టొయినిస్‌ (బి) మోసిన్‌ 6; రఘువంశీ (సి) రాహుల్‌ (బి) మోసిన్‌ 7; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–22, 2–42. బౌలింగ్‌: çజోసెఫ్‌ 4–0–47–0, మోసిన్‌ 4–0–29–2, కృనాల్‌ 1–0–14–0, యశ్‌ 2–0–25 –0, అర్షద్‌  2–0–24–0, బిష్ణోయ్‌ 2.4–0–17–0.  

Advertisement
Advertisement