ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..? | Did Parth Jindal Celebrate Wildly After DC Win Over RR In IPL 2024 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?

Published Wed, May 8 2024 5:41 PM | Last Updated on Wed, May 8 2024 5:59 PM

Did Parth Jindal Celebrate Wildly After DC Win Over RR In IPL 2024

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్నటి (మే 7) మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అనుమానాస్పద క్యాచ్‌ ఔట్‌ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పుడు పార్థ్‌ అతిగా ప్రవర్తించాడు. 

థర్డ్‌ అంపైర్‌ రీప్లే చూస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి ఔట్‌ ఔట్‌ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహ యాజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్‌ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరలైంది. 

ఆ వీడియోలో పార్థ్‌ తన స్థాయిని మరిచి అతిగా విజయోత్సవ సంబురాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్‌పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవరాక్షన్‌ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. 

ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ.. అతను చేసుకున్న సంబురాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్‌ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్‌ ఈ తరహా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. నాటి సంబురాలకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరలవుతుంది. 

ఈ వీడియోను చూసి పార్థ్‌ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. వేల కోట్లకు అధిపతి, ఓ ఫ్రాంచైజీకి సహ యజమాని అయిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ చురకలంటిస్తున్నారు. పార్థ్‌కు పారిశ్రామికవేత్తగా రాని పబ్లిసిటీ ఈ ఒక్క ఘటనతో వచ్చింది. 

మ్యాచ్‌ అనంతర​ం పార్థ్‌.. సంజూ శాంసన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ యజమానితో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాంచైజీకి సహ యజమాని అయిన పార్థ్‌.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జిందాల్‌ కుటుంబం భారత దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యాపార కుటుంబం.

సంజూ వివాదాస్పద క్యాచ్‌ విషయానికొస్తే.. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సంజూ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ రోప్‌కు అతి సమీపాన షాయ్‌ హోప్‌ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌పై ఫీల్డ్‌ అంపైర్‌కు క్లారిటీ లేకపోవడంతో థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు. 

రీ ప్లేలో హోప్‌ చేతిలో బంతి ఉన్నప్పుడు అతను బౌండరీ రోప్‌ను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని ఢిల్లీకి అనుకూలంగా ఇచ్చి శాంసన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై శాంసన్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో గొడవపడి అనంతరం మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సంజూ ఔటైన కావడంతో రాయల్స్‌ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement