Sakshi News home page

‘సూపర్‌’ పోరులో జెయింట్స్‌ పైచేయి

Published Sat, Apr 20 2024 4:05 AM

Lucknow victory on home soil - Sakshi

సొంతగడ్డపై లక్నో విజయం

8 వికెట్లతో ఓడిన చెన్నై

రాణించిన రాహుల్, డికాక్‌   

ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా రెండు  ఓటముల తర్వాత లక్నో సూపర్‌  జెయింట్స్‌ కోలుకుంది. కట్టుదిట్టమైన  బౌలింగ్‌తో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. ఛేదనలో కేఎల్‌ రాహుల్, డికాక్‌ కీలక పాత్ర పోషించగా... రెండు వరుస  విజయాల తర్వాత చెన్నై తలవంచింది.   

లక్నో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో లక్నో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్‌ చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా... రహానే (24 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (20 బంతుల్లో 30; 3 సిక్స్‌లు), ధోని (9 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

అనంతరం లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్‌ డికాక్‌ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 90 బంతుల్లోనే 134 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు.  

ధోని మెరుపులు... 
ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (0) టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగించగా... మరో ఎండ్‌లో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 51 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (17) ప్రభావం చూపలేకపోగా, నాలుగో స్థానంలో వచ్చిన జడేజా పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే రహానేతో పాటు ఫామ్‌లో ఉన్న శివమ్‌ దూబే (3), సమీర్‌ రిజ్వీ (1)లను తక్కువ వ్యవధిలో అవుట్‌ చేసి లక్నో ఆధిక్యం ప్రదర్శించింది.

ఈ సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో వరుసగా 34 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 113/5. అయితే చివరి 4 ఓవర్లలో సూపర్‌ కింగ్స్‌ చెలరేగి 63 పరుగులు రాబట్టింది.

మొహసిన్‌ ఓవర్లో సిక్సర్‌తో 34 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... బిష్ణోయ్‌ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. అనంతరం 19వ ఓవర్లో 4, 6 కొట్టిన ధోని... ఆఖరి ఓవర్లో మరో 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగాడు. ఏడో వికెట్‌కు ధోని, జడేజా 13 బంతుల్లో 35 పరుగులు జోడించారు.  

శతక భాగస్వామ్యం... 
ఛేదనను రాహుల్, డికాక్‌ ఘనంగా ఆరంభించారు. వీరిద్దరిని ఇబ్బంది పెట్టడంలో చెన్నై బౌలర్లంతా విఫలమయ్యారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 54 పరుగులు రాగా... 10.5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు దాటింది.

31 పరుగుల స్కోరు వద్ద డికాక్‌ ఇచ్చిన క్యాచ్‌ను పతిరణ వదిలేయగా, 31 బంతుల్లో రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 41 బంతుల్లో డికాక్‌ కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు అవుటైనా... లక్ష్యం చేరేందుకు లక్నోకు ఇబ్బంది ఎదురు కాలేదు.  

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (బి) కృనాల్‌ 36; రచిన్‌ (బి) మొహసిన్‌ 0; రుతురాజ్‌ (సి) రాహుల్‌ (బి) యశ్‌ 17; జడేజా (నాటౌట్‌) 57; దూబే (సి) రాహుల్‌ (బి) స్టొయినిస్‌ 3; రిజ్వీ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) కృనాల్‌ 1; అలీ (సి) బదోని (బి) బిష్ణోయ్‌ 30; ధోని (నాటౌట్‌) 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు 176. వికెట్ల పతనం: 1–4, 2–33, 3–68, 4–87, 5–90, 6–141. బౌలింగ్‌: హెన్రీ 3–0–26–0, మొహసిన్‌ 4–0–37–1, యశ్‌ ఠాకూర్‌ 4–0–45–1, కృనాల్‌ పాండ్యా 3–0–16–2, రవి బిష్ణోయ్‌ 4–0–44–1, స్టొయినిస్‌ 2–0–7–1.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) ధోని (బి) ముస్తఫిజుర్‌ 54; రాహుల్‌ (సి) జడేజా (బి) పతిరణ 82; పూరన్‌ (నాటౌట్‌) 23; స్టొయినిస్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–161. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–26–0, తుషార్‌ 4–0–42–0, ముస్తఫిజుర్‌ 4–0–43–1, జడేజా 3–0–32–0, పతిరణ 4–0–29–1, అలీ 1–0–5–0.   

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X హైదరాబాద్‌ 
వేదిక: న్యూఢిల్లీ

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement