రెండు వారాలకు ముందు దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.
ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment