తొలి ఘట్టానికి వేళాయె.. | Sakshi
Sakshi News home page

తొలి ఘట్టానికి వేళాయె..

Published Thu, Apr 18 2024 11:40 AM

-

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఏర్పాట్లు పూర్తి

పటిష్ట భద్రత ఏర్పాట్లు

నెల్లూరు(క్రైమ్‌): నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకానున్న తరుణంలో కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లను పోలీస్‌ శాఖ చేపట్టింది. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్‌ యాక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్‌ కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి, లోక్‌సభ నామినేషన్‌ కేంద్రం వద్ద ఏఎస్పీ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక్కో కేంద్రం వద్ద 80 నుంచి 90 మందికిపైగా సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తించనున్నారు. నామినేషన్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థుల ఊరేగింపులను నిలిపేయనున్నారు. ముందస్తు అనుమతులు పొందిన మూడు వాహనాలను నామినేషన్‌ కేంద్ర గేటు వరకు అనుమతించనున్నారు.

నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక ఎన్నికలకు తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానుంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు.. నెల్లూరు లోక్‌సభ స్థానానికి నామినేషన్లను ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు స్వీకరించనున్నారు. ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక ఖాతా ద్వారానే లావాదేవీలు

లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌కు ముందే బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాను తెరవాలి. దీని ద్వారానే ఎన్నికలు లావాదేవీలను నిర్వహించాలి. ఈసీ నిబంధనల మేరకు నగదును జమ చేసి ధరావతు మొదలుకొని ఎలాంటి ఖర్చులనైనా వీటి ద్వారానే జరపాల్సి ఉంటుంది. రూ.20 వేలు మించితే చెక్కుల రూపంలో అందజేయడంతో పాటు ఖర్చులకు సంబంధించిన బిల్లులను చూపాల్సి ఉంటుంది.

సమగ్రంగా నింపాలి

అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాల్లో ఆస్తుల వివరాలు, నేరచరిత్ర, అభియోగాలను విధిగా తెలియజేయాలి. రూ.10 స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ను వేరుగా అందజేయాలి. నామినేషన్‌ పత్రంలో ఖాళీలను వదలకుండా సమగ్రంగా పూర్తి చేసివ్వాలి. తేడాలుంటే ఆర్వోలు నోటీసులిచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు పార్టీలు జారీ చేసే బీ – ఫారం, కుల ధ్రువీకరణ పత్రాలను నామినేషన్‌ చివరి రోజున మూడు గంటల్లోపు అందజేయాలి.

అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి

నామినేషన్‌ దాఖలు సమయంలో ఆర్‌ఓ కార్యాలయంలో అభ్యర్థితో పాటు నలుగురికే అవకాశం ఉంటుంది. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల నిర్వహణ సిబ్బంది ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం ఆర్వోకు అందజేసేందుకు పంపుతారు. ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల నుంచి ర్యాలీలు తదితరాల నిషేధం అమల్లో ఉంటుంది.

పర్యవేక్షణాధికారులు వీరే..

కలెక్టరేట్లో నిర్వహించనున్న నెల్లూరు లోక్‌సభ నామినేషన్ల ప్రక్రియకు ఏఎస్పీ సౌజన్య

నెల్లూరు సిటీకి నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

నెల్లూరు రూరల్‌కు

సీసీఎస్‌ డీఎస్పీ రామకృష్ణాచారి

సర్వేపల్లికి నెల్లూరు రూరల్‌

డీఎస్పీ వీరాంజనేయరెడ్డి

కోవూరుకు ట్రాఫిక్‌ డీఎస్పీ శ్రీనివాసులు

ఆత్మకూరుకు స్థానిక డీఎస్పీ కోటారెడ్డి

ఉదయగిరికి దిశ డీఎస్పీ సాయినాథ్‌

కావలికి స్థానిక డీఎస్పీ వెంకటరమణ

కందుకూరుకు స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు

Advertisement
Advertisement