తగ్గేదేలేదు! | Sakshi
Sakshi News home page

తగ్గేదేలేదు!

Published Wed, Aug 23 2023 12:40 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి, సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 13 ముసాయిదాలు రాజ్‌భవన్‌ ఇప్పటికే తుంగలో తొక్కింది. మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన డీఎంకే మంత్రి సెంథిల్‌ బాలాజీ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని గవర్నర్‌ ప్రదర్శించారు. అదే సమయంలో గుట్కా తదితర కేసుల విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదిక విషయంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులకు అభయం కల్పించే విధంగా గవర్నర్‌ కొత్త మెలికలు పెట్టారు.

ప్రభుత్వం నుంచి పంపించే ప్రతి నివేదికను కొద్ది రోజులు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత వెనక్కి పంపించడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈ పరిణామాలు డీఎంకే పాలకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ను ఓ రాజకీయ నాయకుడిగా చిత్రీకరిస్తూ డీఎంకే మంత్రులు, కూటమి పార్టీలు సవాళ్లను విసిరే పనిలో పడ్డాయి. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలనే హెచ్చరికలు చేస్తూ వస్తున్నాయి.

ఆదివారం నీట్‌ వ్యవహారంలో గవర్నర్‌ తీరుకు వ్యతిరేకంగా అధికార పక్షానికి చెందిన అనుబంధ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాయి. ఇందులో మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌తో పాటు మరికొందరు గవర్నర్‌ను ఏక వచనంతో పిలుస్తూ, తీవ్రవిమర్శలు, ఆరోపణలు, హెచ్చరికలు, సవాళ్లు చేశారు. అయితే, వీటన్నింటికి తాను భయ పడబోనని , ఇంకా చెప్పాలంటే తగ్గేదేలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి దూకుడు పెంచడం గమనార్హం.

టీఎన్‌పీఎస్సీపై పీఠముడి..
రాష్ట్రంలో గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న టీఎన్‌పీఎస్సీ చైర్మన్‌ పదవిని భర్తీ చేయడానికి జూన్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చైర్మన్‌ పదవిలో అప్పటి డీజీపీ శైలేంద్రబాబును నియమించేందుకు నిర్ణయించారు. పదవీ విరమణ చేయగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి గౌరవించే విధంగా సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. శైలేంద్రబాబుతో పాటు మరో 8 మంది సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేయాలని రాజ్‌భవన్‌కు పంపించిన సిఫార్సును రెండు నెలలుగా పట్టించుకోలేదు. ఈక్రమంలో ఎట్టకేలకు మంగళవారం ఈ నివేదికకు వ్యతిరేకంగా గవర్నర్‌ స్పందించారు. చైర్మన్‌, సభ్యుల నియామకంపై అనేక ప్రశ్నలు సంధించారు. ఎంపికకు ముందుగా బహిరంగ ప్రకటన ఇచ్చారా..? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించారా..? అని ప్రశ్నలు సంధించారు.

అలాగే అనేక నిబంధనలను ఉల్లంఘనలను ఎత్తి చూపుతూ నివేదికను వెనక్కి పంపించారు. ఈ ఘటన డీఎంకే పాలకులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఏదేని నివేదిక, ఫైల్స్‌ను ఆమోదం కోసం పంపిస్తే కొన్ని నెలలు, లేదా సంవత్సరం కాలానికి పైగా పెండింగ్‌లో పెట్టడం..తర్వాత వెనక్కు పంపించడం ఈ గవర్నర్‌కు పరిపాటిగా మారిందని డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి మండి పడ్డారు. అదే సమయంలో టీఎన్‌పీఎస్సీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న దృష్ట్యా, గవర్నర్‌కు వివరణ ఇవ్వడమా..? లేదా, తన అధికారాలను ప్రయోగించి నేరుగా సీఎం ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో గవర్నర్‌ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వ్యతిరేకంగా విద్యాసంస్థలకు లేఖలు రాయడం రచ్చకెక్కింది.

స్టేట్‌ సిలబస్‌ అమలుచెయొద్దని వర్సిటీలకు ఆదేశాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వయంప్రతిపత్తిహోదా కలిగిన విద్యా సంస్థలు, వర్సిటీల పరిధిలోని కళాశాలలో ఒకే రకమైన సిలబస్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఆదేశాలు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా వర్సిటీలకు, విద్యా సంస్థలకు గవర్నర్‌ ప్రత్యేక ఆదేశాలతో లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. తమిళనాడు ఉన్నత విద్యలో జనరల్‌ సిలబస్‌కు ఆస్కారం లేదని వివరించారు. అనేక విద్యా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వచ్చిన సమాచారం, ఫిర్యాదులు, వివరాల మేరకు జనరల్‌ సిలబస్‌ అమలును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, విద్యాప్రమాణాలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా పరంగా పార్లమెంట్‌లో చేసిన చట్టం మేరకు అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు వివరించారు. ఇక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్‌ సిలబస్‌ తీసుకొచ్చిందని, దీనిని అమలు చేయవద్దని అన్ని విద్యా సంస్థలను గవర్నర్‌ ఆదేశించడం గమనార్హం. అలాగే మద్రాసు పేరును గతంలోనే ప్రభుత్వం చైన్నెగా మార్చేసింది. దీంతో అప్పటి నుంచి చైన్నె డేగా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చైన్నె డే అని కాకుండా, మద్రాసు డే అని పేర్కొంటూ గవర్నర్‌ మంగళవారం శుభాకాంక్షల తెలియజేస్తూ లేఖ విడుదల చేయడాన్ని తమిళాభిమానులు వ్యతిరేకిస్తున్నారు.

Advertisement
Advertisement