కలకలం.. ఉత్కంఠ!  | Sakshi
Sakshi News home page

కలకలం.. ఉత్కంఠ! 

Published Sat, Mar 16 2024 4:30 AM

BRS leader Kavitha arrested by ED in Delhi liquor policy case - Sakshi

మరికొన్ని గంటల్లో వెలువడనున్న లోక్‌సభ షెడ్యూల్‌ 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు 

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం 

ప్రధాని హైదరాబాద్‌లో ఉండగా చోటు చేసుకున్న పరిణామంతో ఉత్కంఠ 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసేందుకేనన్న విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ మరికొన్ని గంటల్లో వెలువడనుండగా, భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీమద్యం కుంభకోణంలో నిందితురాలుగా పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం కవితను అరెస్టు చేసిన ఈడీ, రాత్రి ఢిల్లీకి తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సమయంలో కవిత అరెస్టు జరగడం సర్వత్రా ఉత్కంఠను రేపింది.

లిక్కర్‌ స్కామ్‌ సుమారు ఏడాదిన్నరగా నడుస్తుండగా, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం.. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా బీఆర్‌ఎస్‌ విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా, కోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ ప్రకటించినా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్టు అంశం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. వంద రోజుల్లోనే కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.

రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే శ్వేతపత్రాలు, విచారణలు, కేసుల పేరిట కాంగ్రెస్‌ ముప్పేట దాడి చేస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ ఒత్తిడి పెంచుతోంది. ఇంకోవైపు బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీన పరచ డం లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ పార్టీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అనుసరించే వ్యూహంపై పార్టీలోనూ, బయటా ఆసక్తి నెలకొంది. 

తొలుత సీబీఐ..తర్వాత ఈడీ 
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షిగా పేర్కొంటూ 2022 డిసెంబర్‌ 3న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్‌ 6న సీబీఐ బృందం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను విచారించింది. ఇదే కేసులో సమాంతర విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 2023 జనవరి నుంచి పలుమార్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణలో ఉన్నందున రాలేనంటూ కవిత పలుమార్లు సమాధానం ఇచ్చారు. చివరకు 2023 మార్చి 9న ఈడీ నోటీసులకు స్పందనగా అదే నెల11, 20 తేదీల్లో విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఫోన్లు, సిమ్‌ కార్డులను అప్పగించారు. ఆ తర్వాత ఈడీ మరోమారు నోటీసు జారీ చేయగా, మహిళలను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు తాజాగా ఈ నెల 19కి వాయిదా పడింది.  

ఏడాదిన్నరగా వేడి 
కవిత వ్యవహారంపై ఏడాదిన్నరగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ నడుమ విమర్శల యుద్ధం జరుగుతోంది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత ‘అరెస్టు’అంశంపై బీజేపీ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లోగా కవితను అరెస్టు చేయిస్తామంటూ బీజేపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు కవితను అరెస్టు చేయకపోవడం బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్‌ విమర్శలు చేస్తూ వచి్చంది.  
రాజకీయ, న్యాయ పోరాటం దిశగా 

బీఆర్‌ఎస్‌ అడుగులు 
రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా క్రియాశీలంగా పనిచేసిన కల్వకుంట్ల కవిత, 2014 లోక్‌సభ ఎన్నికల వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి గెలుపొందిన కవిత 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో 2020, 2022లో నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల లేదా ఆర్మూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు. తాజాగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి మరోమారు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్తిగా పోటీ చేయాలని భావించారు. అయితే రెండు నెలల క్రితమే టికెట్‌ రేసు నుంచి తప్పుకున్నారు. కాగా కవిత అరెస్టు అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోంది. కవిత అరెస్టును రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement
Advertisement